- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆంధ్రా మూలాలుంటే ఆయన పేరు మార్చేస్తారా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ పేరు మార్పును తెలంగాణ ఆర్యవైశ్య సంఘం తప్పుబట్టింది. పొట్టి శ్రీరాములును అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కరీంనగర్‌లో ఆయన విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కుమార్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘పొట్టి శ్రీరాములంటే.. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష ప్రాణాలర్పించిన అమరజీవి మాత్రమే కాదు.. గొప్ప దేశభక్తుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులను వదిలేసుకుని దేశం కోసం పోరాడిన వ్యక్తి. మహాత్మాగాంధీజీకి ఇష్టమైన వ్యక్తి. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించిండు. సత్యాగ్రహా, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3సార్లు జైలుశిక్ష అనుభవించిండు. చరఖా వ్యాప్తికి కృషి చేసిండు. హరిజనోద్యమం కోసం అనేక పోరాటాలు చేసిన నాయకుడు. ‘‘పొట్టి శ్రీరాములు లాంటోళ్లు నావద్ద 10 మంది ఉంటే చాలు.. ఎప్పుడో భారతదేశానికి స్వాతంత్యం తెచ్చేటోడిని’’అని మహాత్మాగాంధీ బహిరంగంగానే చెప్పారంటే ఆయన ఎంత గొప్పవాడో అర్ధం చేసుకోవాలి. అట్లాంటి మహనీయుడు పేరును తొలగించి తీరని అవమానం చేయడమేంది?’’ అని మండిపడ్డారు.
మహనీయులను కాంగ్రెస్ పార్టీకి అవమానించడం అలవాటుగా మారిందన్నారు. ‘‘ఆనాడు అంబేద్కర్‌ను కూడా అడుగడుగునా అవమానించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసిన పొట్టి శ్రీరాములును కూడా పిచ్చివాడిగా ముద్ర వేయాలని చూసింది.’’ అని పేర్కొన్నారు. ‘‘ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరును తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్టీఆర్ పార్క్‌కు ఆయన పేరును తొలగించే దమ్ముందా? కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేరిట ఉన్న పార్కులకు వాళ్ల పేర్లను తొలగించే దమ్ముందా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరిట ఉన్న స్టేడియాలకు ఆ పేర్లను తొలగించే దమ్ముందా?. ట్యాంక్ బండ్‌పై చాలా మంది ఆంధ్రుల విగ్రహాలున్నాయి. వాటిని కూడా తొలగిస్తారా?’’ అని ప్రశ్నించారు.
‘‘ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని పొట్టి శ్రీరాములు పేరును యధాతథంగా తెలుగు విశ్యవిద్యాలయానికి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆర్యవైశ్య సమాజానికి, దేశభక్తులందరికీ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.