Congress : ‘లోకల్’పై కాంగ్రెస్ ఫోకస్! ఆ విమర్శ రాకుండా డెసిషన్?

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-28 03:04:09.0  )
Congress : ‘లోకల్’పై కాంగ్రెస్ ఫోకస్! ఆ విమర్శ రాకుండా డెసిషన్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకొని అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆగస్టు చివరి వారంలో నిర్వహించాలని సూత్రయప్రాయంగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ మేరకు ప్రక్రియ స్టార్ట్ చేయాలని అధికారులకు ఆదేశించారు. అయితే ఎలక్షన్స్ నిర్వహణపై సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది. నోటిఫికేషన్‌ నెలరోజుల్లోపు ఇవ్వొచ్చా? మరింత సమయం పడుతుందా? రిజర్వేషన్ల ఫైనల్‌కు ఎంత సమయం పడుతుంది? బీసీ ఓటర్ల లెక్కింపునకు ఎంత టైం కావాలి ? అనే విషయాలపై ఆరా తీస్తున్నది.

నోటిఫికేషన్ జారీపై చర్చ

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఆగస్టు చివరి వారంలో ఇస్తే ఎలా ఉంటుంది.. దానికయ్యే సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధికారులు స్టడీ చేస్తున్నారు. ముందుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి సర్టిఫై చేసిన ఓటరు జాబితా రావాలి. అందుకోసం ప్రభుత్వం ఈసీకి ఇప్పటికే దరఖాస్తు చేసింది. ఆ లిస్టు వచ్చిన వెంటనే స్టేట్ ఎన్నికల సంఘం గ్రామాలు, వార్డుల వారీగా జాబితా విభజన చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా అధికారులు ప్రతి వార్డులోనూ పర్యటించి, ఇంటింటికీ వెళ్లి బీసీ జనాభా సర్వే చేయాలి. దాని ఆధారంగా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో బీసీ కమిషన్ సిఫారసు చేయాల్సి ఉన్నది. అప్పుడే ఫైనల్‌గా రిజర్వేషన్లు ఫాలో అయ్యే చాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాసెస్ పూర్తికి నెల రోజులు సరిపోతాయా? అనే క్వశ్చన్ వారిలో గుబులు పుట్టిస్తున్నది.

ముందు పంచాయతీనా.. జిల్లా పరిషత్ ఎన్నికలా?

ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా? లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహించడమా ? అనే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నది. ముందుగా కాలపరిమితి తీరిపోయిన పంచాయతీలకు ఎన్నికలు పెట్టకుండా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పెడితే విమర్శలు వస్తాయేమోననే డౌట్ సర్కారును వెంటాడుతున్నది. అయితే ఏ ఎన్నికలు జరగాలన్నా ముందుగా బీసీ జనాభా ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా నోటిఫికేషన్ ఇవ్వొచ్చు. కాని బీసీ రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల హామీని అమలు చేయడం లేదని విమర్శ వచ్చే అవకాశం ఉంటుందని ఓ మంత్రి అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed