MP అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్.. గెలుపు గుర్రాల కోసం తీవ్ర కసరత్తు..!

by Satheesh |   ( Updated:2024-02-26 03:20:16.0  )
MP అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్.. గెలుపు గుర్రాల కోసం తీవ్ర కసరత్తు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంపీ ఎన్నికల్లో నేతలను సమన్వయం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోన్నది. ఏఐసీసీ సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళ్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పవర్‌లో ఉన్నందున బీజేపీ, బీఆర్ఎస్ అసంతృప్తివాదులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. వీరంతా ఎంపీ టిక్కెట్లు ఆశిస్తున్నారు. దీంతో కొత్తోళ్లు, పాతోళ్ల మధ్య టిక్కెట్ల కాంపిటీషన్ మొదలైంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య సమన్వయం కోసం పార్టీ అత్యంత జాగ్రత్తగా మానిటరింగ్ చేస్తోంది. దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని ఆమె భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

చేవెళ్ల సభ తర్వాత..

ఈ నెల 27న చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నది. ఆ తర్వాత ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్ మొదలుకానున్నది. రాష్ట్రంలోని 17 సెగ్మెంట్‌లకు 306 అప్లికేషన్లు రాగా, వీటిని స్క్రీనింగ్ కమిటీ ఫిల్టర్ చేయనున్నది. చేవెళ్ల మీటింగ్ తర్వాత ప్రదేశ్ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. సెగ్మెంట్‌కు 2,3 పేర్ల చొప్పున జాబితాను తయారు చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతారు. అక్కడా అభ్యర్థుల తుది ఎంపికపై హైకమాండ్ వివిధ సమీకరణాలు, సర్వేలు, పార్టీ మైలేజీకి ప్రాధాన్యమివ్వనుంది. కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్‌లకు ఇతర పార్టీలకు దీటుగా అభ్యర్ధులు లేరనే భావన కాంగ్రెస్‌లో ఉన్నది. దీంతో ఇతర పార్టీల నుంచి చేరికలు ఉండే చాన్స్​వల్ల లిస్టు ఎంపికను కాంగ్రెస్ ఆలస్యం చేస్తున్నట్లు టాక్. కీలక నేతలు చేరితే టిక్కెట్లు సర్దుబాటు చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోన్నది.

ఏ స్థానాల్లో ఎలా..?

పలు సెగ్మెంట్ల నుంచి కీలక నేతల కుటుంబ సభ్యులు, సీనియర్​ నేతలు పోటీలో ఉన్నందున టికెట్​ దక్కనివారిని ఎలా సర్దుబాటు చేయాలనే ఆలోచనలో పార్టీ ఉంది.

ఖమ్మం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, వ్యాపారవేత్త వీరయ్య చౌదరి కుమారుడు రాజేంద్ర ప్రసాద్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

నల్లగొండ: సూర్యాపేట అసెంబ్లీ టిక్కెట్ వదులుకున్న పటేల్ రమేశ్​రెడ్డికి నల్గొండ ఎంపీ సీటుపై పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ స్థానానికి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా అప్లై చేశారు.

సికింద్రాబాద్: తాజాగా పార్టీలో చేరిన బొంతు రామ్మోహన్​కు దాదాపు ఖరారైనట్టేనని టాక్. కానీ ఇదే స్థానం కోసం విద్యావేత్త విద్యా స్రవంతి కూడా ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారని పార్టీలో చర్చ. తాజాగా ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్ గౌడ్‌ను కలసినట్లు నేతల్లో ప్రచారం ఉన్నది.

భువనగిరి: స్థానం నుంచి మొదటి రేసులో చామల కిరణ్​కుమార్ రెడ్డి ఉండగా, కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి పవన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

మల్కాజిగిరి: సీఎం రేవంత్​ ప్రాతినిథ్యం వహించిన ఈ సెగ్మెంట్​ ఎవరికి ఇస్తారనేది సస్పెన్స్​గా మారింది. ఈ సీటు కోసం కపిలవాయి దిలీప్ కుమార్, సినీ నిర్మాత బండ్ల గణేష్​ అప్లై చేశారు. కానీ సీఎం సోదరుడు కూడా రంగంలోకి దిగే చాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

నిజామాబాద్​: జీవన్​రెడ్డి, ఆకుల లలిత, ఈరవత్రి అనిల్ పోటీ పడుతున్నారు.

మహబూబాబాద్​: బెల్లయ్య నాయక్, బలరామ్ నాయక్, మంత్రి పొంగులేటి టీమ్ నుంచి బానోత్ విజయాబాయి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

మెదక్: నీలం మధుకు కన్ఫామ్ అయినట్లు వార్తలు రాగా మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కూడా తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆదిలాబాద్: రేఖ నాయక్, నరేశ్​​ జాదవ్, ప్రకాశ్ ​రాథోడ్ ట్రై చేస్తుండగా, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఆయనకే టిక్కెట్ ఇస్తారనే చర్చ కూడా ఉన్నది.

పెద్దపల్లి: గడ్డం వంశీ పేరు ఖరారైనట్లు సమాచారం. కానీ తాజాగా పార్టీలో చేరిన వెంకటేశ్​​ నేతకాని కూడా టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు.

వరంగల్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, విద్యార్ధి నేత పిడమర్తి రవి ప్రయత్నిస్తుండగా, ఇతర పార్టీల నుంచి ఈ సెగ్మెంట్‌లో చేరికలు ఉంటాయనే భావనలో పార్టీ ఉన్నది.

నాగర్ కర్నూల్​లో మల్లు రవి, మహబూబ్ నగర్​కు వంశీచంద్ రెడ్డి పేర్లు కన్ఫామ్​ అయినట్లు వార్తలు రాగా జహీరాబాద్​కు సురేశ్​షెట్కార్, చేవెళ్లకు సునీతా మహేందర్ రెడ్డి పేర్లు కూడా ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోన్నది.

Also Read..

బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు..?

Advertisement

Next Story

Most Viewed