Congress: గౌడ నేతకు ఫస్ట్ టైమ్ పీసీసీ.. ఈనెల 15న మహేశ్ గౌడ్ బాధ్యతలు

by Shiva |
Congress: గౌడ నేతకు ఫస్ట్ టైమ్ పీసీసీ.. ఈనెల 15న మహేశ్ గౌడ్ బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఫస్ట్ టైమ్ గౌడ సామాజికవర్గ నాయకుడికి అవకాశం లభించింది. 1953 తర్వాత ఎంపికైన అధ్యక్షుల్లో ఒక్కరు కూడా గౌడ కులానికి చెందిన లీడర్లు లేరు. దీంతో ఈ దఫా చాన్స్ ఇవ్వాలని భావించిన ఏఐసీసీ.. పార్టీకి 38 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించిన మహేశ్‌ ​కుమార్‌గౌడ్‌ను ఎంపిక చేసింది. దీంతో ఏఐసీసీ అగ్రనేతలకు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 15న గాంధీభవన్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అగ్రలీడర్లకు ఆహ్వానం పలకనున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో పాటు పలువురు ఏఐసీసీ నేతలు హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మహేశ్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఆయన ఫాలోవర్స్ గాంధీభవన్‌ను రెడీ చేస్తున్నారు. కొత్త రంగులు, వాల్స్‌తో ప్రాంగణమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీలో గాంధీభవన్‌కు చేరుకునేలా ప్లాన్ చేశారు. డప్పులు, వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో కార్యక్రమం నిర్వహిస్తామని గాంధీభవన్‌లోని ఓ నేత తెలిపారు.

ప్రతిసారి కాపులకే..

1989 నుంచి బీసీలకు పీసీసీ చీఫ్ పదవి లభించింది. ప్రతి సారి కాపు, మున్నూరు, తూర్పు కాపు సామాజిక వర్గం నేతలకే ఆ అవకాశం దక్కింది. 1989 నుంచి 1994 వరకు వీ.హనుమంతరావు పీసీసీ అధ్యక్షుడి హోదాలో వర్క్ చేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2005 వరకు డీ.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు కే.కేశవరావు, 2008 నుంచి 2011 వరకు మళ్లీ డీ.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు బొత్స సత్యనారాయణ, 2014 నుంచి 2015 వరకు పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్‌లుగా పనిచేశారు. ఆయా నేతలంతా కాపు, మున్నూరు కాపు, తూర్పు సామాజికవర్గ నేతలు కావడం గమనార్హం. తెలంగాణ వచ్చిన పదేండ్ల తర్వాత మళ్లీ బీసీకి పీసీసీ చీఫ్ పోస్టు లభించగా, అదీ గౌడ్ సామాజిక వర్గానికి రావడం గమనార్హం. 2004 నుంచి 2014 వరకు పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత పనిచేయగా, సీఎంగా ఓసీ లీడర్లు వర్క్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed