పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్.. ఇంకా రంగంలోకి దిగని బీఆర్ఎస్!

by GSrikanth |
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్.. ఇంకా రంగంలోకి దిగని బీఆర్ఎస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ తరపున సునీల్ బన్సల్ ఆదిలాబాద్ జిల్లాపై కన్నేశారు. ఈ నెల చివరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా మొత్తం 17 పార్లమెంటు సెగ్మెంట్లకు ఏఐసీసీ తరఫున, పీసీసీ తరఫున ఇన్‌చార్జిలను ప్రకటించింది. రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై వ్యూహాన్ని రూపొందించింది.

టార్గెట్ 15.. యాక్షన్ ప్లాన్

రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉండగా.. 15 చోట్ల గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకున్నది. కచ్చితంగా 12 సీట్లు కైవసం చేసుకోవచ్చని, టఫ్‌గా ఉండే మరో మూడు స్థానాలనూ గెలిచేయాలని వ్యూహాలు రూపొందిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అవకాశంగా మల్చుకుని ఎంపీ ఎలక్షన్స్ లోనూ చక్రం తిప్పాలనుకుంటున్నది. పీఏసీ కమిటీ గాంధీభవన్‌లో సమావేశమై పక్కా ప్లాన్ రూపొందించింది. ప్రతీ పార్లమెంటు సెగ్మెంట్‌కు ఏఐసీసీ తరఫున ఒక ఇన్‌చార్జితో పాటు పీసీసీ తరపున మంత్రులు కూడా ఇన్‌చార్జిలుగా వ్యవహరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తలా రెండు పార్లమెంటు స్థానాలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరించనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్థానాలను పరిగణనలోకి తీసుకుని వాటి పరిధికి చెందిన పార్లమెంటు సెగ్మెంట్లలోనూ ఓటు బ్యాంకును ఆకర్షించడం కోసం స్ట్రాటజీ తయారవుతున్నది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయనే కాన్ఫిడెన్సు ఉన్నప్పటికీ, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజగిరి, మెదక్, చేవెళ్ల స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ మరింత కష్టాపడాల్సి ఉంటుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. హైదరాబాద్‌, సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క చోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. మెదక్ ఎంపీ పరిధిలో మెదక్ మినహా మిగిలినవన్నీ బీఆర్ఎస్ చేజిక్కించుకున్నది. దీంతో వీటిని ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

గతంకంటే పెంచుకునేలా బీజేపీ

గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి మరింత పెంచుకోవాలని భావిస్తున్నది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలను గెలవడంతో అక్కడి ఎంపీ సీట్లపై ఎక్కువ దృష్టి పెట్టింది. సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానం కావడంతో మళ్లీ గెలవాలనుకుంటున్నది. ఈ ఎంపీ పరిధిలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ బీజేపీ గెలవలేదు. ముషీరాబాద్, అంబర్‌పేట్ లాంటి పట్టున్న సీట్లను కూడా బీజేపీ ఈసారి కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎంపీ ఎలక్షన్స్ బీజేపీకి కీలకం కావడంతో ఈసారి మూడు నెలల ముందే అలర్టయింది. జేపీ నడ్డా ఈ నెలాఖరున పర్యటించి స్టేట్ లీడర్లతో రివ్యూ చేసిన తర్వాత ప్రధాని మోడీ, అమిత్ షా మొదలు పలువురు సీనియర్ నాయకులు రాష్ట్రంలో క్యాంపెయిన్ చేయనున్నారు.

ఫోకస్ పెట్టని బీఆర్ఎస్

రెండు జాతీయ పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నా.. బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు ఫోకస్ పెట్టలేదు. అనారోగ్యం కారణంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పొలిటికల్‌గా ఇంకా యాక్టివ్ కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్లను టేబుల్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో దీటుగా ఎదుర్కోడానికి కేటీఆర్, హరీశ్‌‌రావు వాటిపై దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో పదహారు సెగ్మెంట్లను బీఆర్ఎస్ టార్గెట్‌గా పెట్టుకున్నా సింగిల్ డిజిట్ (తొమ్మిది సీట్లు)కే పరిమితమైంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎఫెక్టు నుంచి బీఆర్ఎస్ ఇంకా తేరుకోలేదని, అందువల్లనే లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టలేకపోతున్నదని ఆ పార్టీ నేతల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రధాన పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యనే ఉంటుందనే జనరల్ టాక్ మొదలైంది.

రాజ్యసభ సైతం..

గత అసెంబ్లీ ఎన్నికల్లో బలం ఉండడంతో అన్ని రాజ్యసభ స్థానాలనూ గెలిచిన బీఆర్ఎస్ వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో ఖాళీ అవుతున్న ముగ్గురిలో ఒక్కరికే చాన్స్ ఉన్నది. మిగిలిన రెండింటినీ కాంగ్రెస్ గెల్చుకునే అవకాశమున్నది. లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది మందిని గత ఎన్నికల్లో గెలిపించుకున్నా ఈసారి ఇంకా యాక్టివ్ మోడ్‌లోకి రాలేదు. దీంతో దూకుడు మీద ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లను ఆ పార్టీ ఎలా ఢీకొడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story

Most Viewed