అనుబంధ అధ్యాపకుల నియామకంలో గందరగోళం

by Anjali |
అనుబంధ అధ్యాపకుల నియామకంలో గందరగోళం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద యూనివర్సిటీగా కాకతీయ యూనివర్సిటీకి పేరుంది. అయితే ఇప్పుడా పేరు మసకబారేలా కనిపిస్తోంది. అక్రమంగా నియామకాలు చేపడుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో న్యాక్ పేరు మీద 12 మంది అనుబంధ అధ్యాపకులను ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా కేవలం ఈసీ అనుమతితో నియమించారు. వీరికి నెలకు రూ.50 వేల వేతనం చెల్లిస్తున్నారు. తాజాగా మరో నలుగురిని నియమించడం చర్చనీయాంశంగా మారింది.

నిబంధనలు గాలికి

అనుబంధ అధ్యాపకులను నియమించుకోవాలంటే నోటిఫికేషన్ విడుదల చేసి, ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేయడానికి ఒక సెలెక్షన్ కమిటీని నియమించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఈసీ అనుమతితో వీసీ నియమించడం వివాదాస్పదమైంది. ఫార్మసీ కాలేజీలో గతంలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ రఘురామరావును నియమిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎడ్యుకేషన్ కాలేజీలో ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్, బాటనీ విభాగంలో డాక్టర్ క్రిస్టొఫర్, కామర్స్ కాలేజీకి ప్రొఫెసర్ కృష్ణమాచారిని నియామకానికి ఈసీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

ఒక్కరికే నాలుగు పదవులు

యూజీసీ నిబంధనల ప్రకారం ఒక రిటైర్డ్ ప్రొఫెసర్‌కు ఎలాంటి పాలన పదవులు ఇవ్వకూడదు. దీనికి విరుద్ధంగా ప్రొఫెసర్ శ్రీనివాస్‌ను రిజిస్ట్రార్‌గా, ఎస్‌డీఎల్‌సీ‌ఈ డైరెక్టర్‌గా, ఎస్ఎఫ్‌సీ సెల్ డైరెక్టర్‌గా, అనుబంధ అధ్యాపకుడిగా నియమించారు. 2014 తర్వాత ఎటువంటి నియామకాలు ప్రభుత్వ అనుమతి లేనిదే జరపకూడదనే నిబంధనలను తుంగలో తొక్కారు. వీసీ తన ఇష్టానుసారం రిటైర్డ్ ప్రొఫెసర్లకు ప్రాధాన్యత ఇస్తుండడంతో రెగ్యులర్ ప్రొఫెసర్లు వీసీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story