చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నా: మాజీ మంత్రి హరీష్ రావు

by Mahesh |   ( Updated:2024-07-16 15:13:51.0  )
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నా: మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం సాయంత్రం సమయంలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులను బయటకు రాకుండా గేటుకు తాళం వేశారు. అలాగే కొంతమందిని అదుపులోకి తీసుకుని స్థానిక స్టేషన్ కు తరలించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి మారిపోయింది. సెంట్రల్ లైబ్రేరి కి తాళం వేయడంతో లోపల ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లో చదువుకుంటున్న విద్యార్థుల పై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు.

తన ట్వీట్‌లో "గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం. ఇదేనా ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..? విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలి. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను" అని రాసుకొచ్చారు. కాగా ఈ రోజు సాయంత్రం లైబ్రరీలో భారీగా ఉన్న నిరుద్యోగులు డీఎస్సీ అభ్యర్థులు దర్నాకు దిగేందుకు సిద్దమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story