ఆర్టీసీలో మెరుపు సమ్మె.. అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన

by GSrikanth |
ఆర్టీసీలో మెరుపు సమ్మె.. అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన
X

దిశ, కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీలో అద్దె బస్సుల డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. శనివారం ఉదయం నుండి వీరు వన్ డిపో ముందు తమ నిరసన తెలుపుతున్నారు. తమ పట్ల వివక్ష చూపుతున్నారని, ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. చిన్న చిన్న కారణాలు పెద్దవిగా చూపుతు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అద్దె బస్సుల డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ 1, 2 డిపోలు రెండు కలిపి సమారు 70 అద్దె బస్సులు నడుస్తుండగా ఈ బస్సులను నడిపే 140 మంది డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు తమతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలి డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కరీంనగర్ నుండి వివిధ రూట్లలో వెళ్లాల్సిన బస్సులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా కరీంనగర్ సమీపంలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేవారు, అక్కడి నుండి కరీంనగర్‌కు చేరుకునే వారికి తీవ్ర ఇబ్బంది ఎదురయింది. విద్యార్థులు కూడా స్కూళ్లకు చేరడంతో పాటు కూరగాయల రైతులు పంటను కరీంనగర్ మార్కెట్ తరలించడానికి ఇక్కట్ల పాలవుతున్నారు. అయితే అద్దె బస్సుల సంఘం ప్రతినిధి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు తమ బస్సుల డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని ఇప్పటికే ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే అద్దె బస్సులు డ్రైవర్లతో 10 గంటల వరకు ఆర్టీసీ అధికారులు కూడా చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story