మైనంపల్లి టార్గెట్ ఫిక్స్! మాతో రండి.. కలిసి పనిచేద్దామంటూ..

by Sathputhe Rajesh |
మైనంపల్లి టార్గెట్ ఫిక్స్! మాతో రండి.. కలిసి పనిచేద్దామంటూ..
X

దిశ బ్యూరో, సంగారెడ్డి/ మెదక్ ప్రతినిధి : మెదక్ సెగ్మెంట్ అధికార పార్టీలో రాజకీయం సరవత్తరంగా మారింది. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ. పార్టీ అధిష్టానం మద్య ఏం జరుగుతుందో తెలియక పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయం చెందుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుబాష్ రెడ్డిలు ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇప్పుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కొడుకును రంగంలోకి దింపారు. ఆయనతో పాటు కొడుకు రోహిత్ రావులు తమ రాజకీయం మొదలు పెట్టారు.

తాను గతంలో మెదక్ ఎమ్మెల్యేగా పనిచేయడంతో మైనంపల్లికి పార్టీ క్యాడర్‌తో మంచి సంబందాలున్నాయి. మా కొడుకు వచ్చిండు.. అందరం కలిసి పనిచేద్దాం. రండి మాతో కలిసి నడవండి అంటూ తండ్రీ కొడుకులు పార్టీ నాయకులకు ప్రత్యేకంగా ఫోన్లు చేస్తున్నారు. ఖర్చుకు వెనకాడేది లేదు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల పేరున రూ.25వేల డిపాజిట్ చేస్తా. స్కూళ్లు దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. సేవా కార్యక్రమాలు చేపడతాం అంటూ మైనంపల్లి హనుమంతరావు, రోహిత్‌లు పార్టీ శ్రేణులను, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన పార్టీలో అసలు ఏం జరుగుతోంది..? అంటూ బీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు..

మాతో రండి కలిసిపనిచేద్దాం..

ఇటీవలే మెదక్ సెగ్మెంట్‌లో మైనంపల్లి హనుమంతరావు రాజకీయం షురూ చేశారు. మైనంపల్లి ట్రస్ట్ పేరుతో తన కొడుకు రోహిత్ రెడ్డిని రంగంలోకి దింపారు. కొడుకుతో పాటు ఆయన కూడా పర్యటిస్తున్నారు. ఏడుపాయల దుర్గామాతను దర్శించుకున్నారు. చిన్నశంకరంపేటలో వివిద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి మండలంలో ఓ స్కూలును ఆదర్శంగా మారుస్తామని, తల్లిదండ్రులు లేని పిల్లల పేరున రూ.25వేల డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. కరోనా సమయంలో తన కొడుకు రోహిత్ మైనంపల్లి ట్రస్ట్ ద్వారా రూ.10కోట్లు ఖర్చు పెట్టారని తండ్రి హనుమంతరావు కొడుకు గురించి గొప్పగా చెప్పుకున్నారు.

మెదక్ బరిలో రోహిత్ ఉంటారని ఆయన చెప్పకనే చెప్పారు కూడా. ఇదిలా ఉండగా తనకు పార్టీ క్యాడర్‌తో మంచి సంబందాలు ఉండడంతో ఎమ్మెల్యే హనుమంతరావు స్వయంగా పార్టీ నాయకులకు ఫోన్లు చేస్తూ తమతో కలిసి పనిచేయాలని కోరుతున్నారు. రోహిత్ రెడ్డి కూడా ఫోన్లు చేస్తున్నారు. మీకు మేమున్నాం. డబ్బులకు వెనకాడేది లేదు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతాం.

ఊపిరి ఉన్నంత వరకు సేవ చేస్తా అంటూ రోహిత్ ప్రకటనలు చేస్తున్నాడు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ‌పై అసంతృప్తి‌తో ఉన్న నేతల వివరాలు సేకరించి వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. నాలుగు మండలాలకు చెందిన నేతలతో చేగుంట మండలం కర్నాల్‌పల్లి ఎల్లమ్మ గుడి వద్ద విందు కూడా ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతుంది.

ఉత్సాహంగా రెండో సారి ఎమ్మెల్యేగా...

తెలంగాణ ఏర్పాటు తరువాత జరిగిన ఎన్నికల్లో మెదక్ నియోజక వర్గంలో పెను మార్పులు జరిగాయి. అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంత్ రావు మల్కాజ్‌గిరికి వెళ్ళడంతో ఆయన స్థానంలో బట్టి జగపతికి టీడీపీ నుంచి బరిలో దిగారు. పద్మాదేవేందర్ 2014లో టీఅర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మాత్రం అప్పటి వరకు ఎంపీగా విజయశాంతి కొనసాగారు.

కానీ కేసీఆర్ మెదక్ పార్లమెంట్ స్థానానికి సైతం పోటీ చేయడంతో విజయ శాంతి కాంగ్రెస్ నుంచి మెదక్ అసెంబ్లీ బరిలో నిలిచారు. తెలంగాణ సెంటి మెంట్ బలంగా ఉండడంతో పాటు ఉద్యమంలో ముందుండి పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండవ సారి బరిలో నిలిచిన పద్మను మెదక్ ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారు. ప్రస్తుతం మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పద్మ తిరుగులేని నాయకురాలిగా కొనసాగుతున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలో ఉన్న కీలక నేతలు సైతం బీఅర్ఎస్‌లో చేరడంతో మెదక్‌లో స్ట్రాంగ్ ప్రతి పక్షం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షం లేకపోవడంతో పద్మకు కలిసి వస్తోంది.

ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి రంగంలోకి...

మెదక్‌లో పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తరుణంలోనే హవేలీ ఘనపూర్ మండలం కూచన్ పల్లి చెందిన శేరి సుభాష్ రెడ్డి మెదక్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నేనున్నానంటూ రంగంలో దిగారు. సీఎం రాజకీయ కార్యదర్శిగా కొనసాగడంతో పాటు ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. దీంతో ఆయన మెదక్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానంగా అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులను ఆయన చేరదీశారు.

పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు కొంత క్యాడర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ బీఆర్ఎస్ టిక్కెట్టు శేరి సుభాష్ రెడ్డికి వస్తుందన్న ధీమాతో ఆయన వర్గీయులు ఉన్నారు. మెదక్ సెగ్మెంట్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇద్దరు పోటాపోటీగా కార్యక్రమాల్లో పాల్గొనడం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు వర్గాలు కూడా తమ నేతకే అన్న నమ్మకంతో ఉన్న తరుణంలో మైనంపల్లి రోహిత్ ఎంట్రీ కొత్త చర్చ కు దారి తీసింది.

మెదక్ స్థానంలో ఎప్పుడూ మార్పులే..

2009లో నియోజక వర్గాల పునర్విభజనలో రామాయంపేట నియోజకవర్గం మెదక్ నియోజకవర్గంలో కలిసి పోయింది. దీనితో రామాయపేట టీడీపీ ఎమ్మెల్యే‌గా ఉన్న మైనంపల్లి హన్మంత్ రావు మెదక్ అసెంబ్లీ నుంచి మహా కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీఅర్ఎస్ మహా కూటమిలో కలవడం వల్ల మెదక్ సీటు పొత్తులో టీడీపీకి కేటాయించారు. రామాయంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లికి మెదక్ అసెంబ్లీ సీటు టిక్కెట్టు దక్కింది.

అప్పటి మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా స్వతంత్ర అభ్యర్థిగా పద్మా దేవేందర్ రెడ్డి, ప్రజా రాజ్యం నుంచి బట్టి జగపతి పోటీలో నిలిచారు. కానీ 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మెదక్‌లో మాత్రం టీడీపీ అభ్యర్థి మైనం పల్లి హన్మంత్ రావు ఘన విజయం సాధించారు.

తరవాత పద్మా దేవేందర్ రెడ్డి మళ్ళీ సొంత పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్ మెదక్‌లో ఓడిన రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనధికార ఎమ్మెల్యేగా శశిధర్ రెడ్డి కొనసాగారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉదృతం కావడం కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ప్రకటనతో రాష్ట్రంలో అనేక మార్పులు జరిగిన విషయం తెలిసిందే. కాగా వచ్చే ఎన్నికల్లో పార్టీల మధ్య పోటీ కంటే అధికార పార్టీలో టిక్కెట్టు‌పై అందరూ చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed