ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేతపై వారిదే ఫైనల్ డెసిషన్: మంత్రి గంగుల కమలాకర్

by Satheesh |   ( Updated:2023-06-16 14:40:37.0  )
ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేతపై వారిదే ఫైనల్ డెసిషన్: మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 18 జిల్లాల్లో సంపూర్ణంగా ధాన్యం సేకరణ పూర్తయిందని.. మిగిలిన జిల్లాల్లోనూ ఈ నెల 18 వరకూ పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఆలస్యంగా వరి కోతలు జరిగిన ప్రాంతాల్లో రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లు చేసేందుకు వీలుగా కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చామన్నారు. గత సీజన్ కన్నా 15లక్షల మెట్రిక్ టన్నులను అధికంగా కొనుగోళ్లు చేశామన్నారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. యాసంగిలో రైతాంగానికి సంపూర్ణంగా అండగా ఉండి, పకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి ధాన్యం సేకరణ చేశామన్నారు.

శుక్రవారం ఒక్కరోజే రైతుల ఖాతాల్లోకి రూ.3వేల కోట్లు జమచేశామని, మిగతా మొత్తాన్ని ఈనెల 20 లోగా రైతులకు అందజేస్తామన్నారు. ఈ నెల 15 వరకు 64.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 11 లక్షల మంది రైతుల నుంచి సేకరించామన్నారు. ధాన్యం విలువ 13,264 కోట్లు ఉంటుందని, ఇందులో ఓపీఎంఎస్లో నమోదు చేసిన 10,439 కోట్లలో 9,168 కోట్లను రైతులకు అందజేశామన్నారు. గతంలో కన్నా రాష్ట్ర వ్యాప్తంగా7034 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పటికే 90శాతానికి పైగా సేకరించామన్నారు. కొనుగోళ్లు పూర్తయిన 6143 కేంద్రాలను మూసి వేశామన్నారు. యాసంగి ధాన్యం సేకరణలో దేశంలో నెంబర్ వన్ గా తెలంగాణ నిలిచిందన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం సేకరించామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed