CM Revanth: జిల్లాల్లో ‘హైడ్రా’ తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-09-03 15:18:00.0  )
CM Revanth: జిల్లాల్లో ‘హైడ్రా’ తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరద ఉధృతితో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి వెంటనే కేంద్రం రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాలపై ఎప్పటికప్పుడు తనతో పాటు మంత్రులు సంబంధిత కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారని పేర్కొన్నారు. సర్కార్ అప్రమత్తంగా ఉన్నప్పటికీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ముఖ్యంగా వరదల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు దెబ్బతిన్నాయని అన్నారు. విపత్తులో వీలైనంత తక్కువ నష్టం జరిగేలా ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. అధికారుల తక్షణ చర్యలతో ప్రాణ నష్టం భారీగా తగ్గిందని ఆ విషయంలో రెవెన్యూ, పోలీసు అధికారులను అభినందిస్తున్నానని సీఎం అన్నారు.

ఇంకా వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పూర్తిగా దెబ్బతిన్న మూడు తండాలను ఒక గ్రామంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని కూడా వెంటనే అంచనా వేయాలని సూచించారు. ప్రాథమికంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేశామని అన్నారు. తెలంగాణలో వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నారు. తక్షణమే కేంద్రం రూ.2 వేల కోట్లను తెలంగాణ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వరద నష్టాన్ని పరిశీలించేందుకు రావాలని ప్రధానిని ఆహ్వానించారు. అధికారులు ఇక ముందు ఇదే తరహాలో పని చేయాలని.. నష్ట నివారణ చర్యలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.

వదర బాధితులకు నష్ట పరిహారం విషయంలోనూ నివేదికలు సిద్ధం చేయాలని, వరద ప్రాంతాల్లో మందస్తు నివేదికలను కలెక్టరేట్‌లో ఉండాలని తెలిపారు. చెరువులను కబ్జా చేయడం వల్లే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని గుర్తు చేశారు. అందుకు ఆక్రమణలు అడ్డుకునేలా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ముందుకెళ్తోందని అన్నారు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించచాలనే డిమాండ్ వస్తోందని.. త్వరలోనే జిల్లాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed