స్పీడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. వరుసగా మూడు సమీక్షలు

by GSrikanth |
స్పీడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. వరుసగా మూడు సమీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మూడు వేర్వేరు అంశాలపై వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు. తొలుత వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులతో సమీక్ష జరిపి ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ తదితరాలపై రివ్యూ చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణమీద అధికారులతో చర్చించనున్నారు. తొలి సమీక్షా సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన తాజా అంశాలతో పాటు ఈ నెల చివర్లో రైతులకు విడుదల చేయాల్సిన రైతుభరోసా అంశంమీద అధికారులతో చర్చిస్తున్నారు. గత ప్రభుత్వం అమలుచేసిన రైతుబంధు స్కీమ్, దానికి రూపొందించిన మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన విధానం తదితరాలపై లోతుగా చర్చిస్తున్నారు.

ప్రతీ ఏటా డిసెంబరు చివరి వారంలో రైతుబంధును అమలుచేయడం ఐదేండ్లుగా ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా పంట నాట్లను దృష్టిలో పెట్టుకుని ఈ నెల చివరి నుంచి రైతుభరోసాను అమలు చేయడంలోని సాధ్యాసాధ్యాలు, సమకూర్చుకోవాల్సిన నిధులు, ప్రతి ఎకరాకు పెంచాల్సిన ఆర్థిక సాయం, లబ్ధిదారుల ఎంపికపై పునఃపరిశీలన తదితర అంశాలు కూడా చర్చకు రానున్నట్లు అధికారవర్గాల సమాచారం.

ప్రజాదర్బార్‌లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత పనితీరు, ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లు, జరగనున్న పరీక్షలు తదితరాలపై కూడా మరో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. గ్రూపు-2 పరీక్షల జనవరిలో నిర్వహించేలా షెడ్యూలు ఖరారైనందువల్ల ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులపైనా అధికారుల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్పష్టతకు రానున్నది.

రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నదంటూ ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంతో పాటు నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుని పూర్తిస్థాయిలో నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంబంధిత అధికారులతో, పోలీసు విభాగాల ఆఫీసర్లతో చర్చించిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆ అంశం కోసమే పనిచేస్తున్న నార్కోటిక్స్ వింగ్ పనితీరు, సాధించిన ఫలితాలు, ఎదురవుతున్న సవాళ్ళు, తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు తదితరాలపై కూడా అధికారులతో చర్చించిన తర్వాత సీఎం రేవంత్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశమున్నది.

మూడు వరుస రివ్యూ మీటింగులు ఉన్నందున సాయంత్రం వరకూ సచివాలయంలోనే ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story