వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి.. రీజినల్ రింగు రోడ్డుపై రివ్యూలో సీఎం ఆదేశం

by Gantepaka Srikanth |
వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి.. రీజినల్ రింగు రోడ్డుపై రివ్యూలో సీఎం ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రీజినల్ రింగు రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని నొక్కిచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దక్షిణ భాగంలో అలైన్‌మెంట్ మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో అనేక రంగాలకు చెందిన పరిశ్రమలు వస్తున్నందున ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్‌‌లోని బందరు (మచిలీపట్నం), కాకినాడ పోర్టుల్ని వినియోగించుకోవాలని, దానికి అనుగుణంగానే తెలంగాణలో డ్రై పోర్టును ఎక్కడ నెలకొల్పాలనేది ఫైనల్ చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈ రెండు పోర్టుల్లో దేన్ని వినియోగించుకోడానికి సమ్మతి తెలియజేస్తుందో పరిశీలించి దానికి అనుగుణంగా రాష్ట్రంలో డ్రై పోర్టు నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. దూరం, సమయాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఆలోచించాలన్నారు. ఇది పూర్తయిన తర్వాతే గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రూపకల్పన జరగాలన్నారు.

రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, అలైన్‌మెంట్‌పై ముఖ్యమంత్రి తన నివాసంలో బుధవారం రాత్రి నిర్వహించిన సమీక్షలో పై అంశాలను పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో మార్పులు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం నొక్కిచెప్పారు. కొత్తగా ఏర్పడుతున్న ఫోర్త్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నందున అందులో పనిచేసే అధికారులు, కార్మికులు, ఇతర సిబ్బందికి, వారి కుటుంబాలకు విద్య, వైద్య తదితర వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు మద్య కనెక్టివిటీ గురించి జరిగిన చర్చలో భాగంగా రేడియల్ రోడ్ల నిర్మాణంపై గత సమావేశం తర్వాత చోటుచేసుకున్న పురోగతిని సమీక్షించారు. ఫోర్త్ సిటీ నుంచి డ్రై పోర్టుకు వెళ్ళేందుకు నిర్మించే రేడియల్ రోడ్లపైనా సుదీర్ఘంగా చర్చ జరిగింది. గ‌త స‌మీక్ష‌లో ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్‌లో ముఖ్య‌మంత్రి చేసిన సూచనలకు అనుగుణంగా మార్పులు జరిగాయి. అయినా కొన్ని తేడాలుండ‌డంతో వాటిని కూడా సవరించాలని తాజాగా సూచించారు. ఫైన‌ల్ అయిన త‌ర్వాత కార్యాచ‌ర‌ణను వెంట‌నే చేప‌ట్టాల‌న్నారు.

భూసేకరణలో మానవీయ కోణం :

ఔటర్ రింగు రోడ్డు నుంచి ఆర్ఆర్ఆర్ వ‌ర‌కు నిర్మించ‌నున్న రేడియ‌ల్ రోడ్ల ప్ర‌గ‌తిపై సీఎం రేవంత్... రేడియ‌ల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ స‌మీక‌ర‌ణ, భూ సేక‌ర‌ణ‌ చేయాల‌న్నారు. ర‌హ‌దారులు, ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కు భూ సేక‌ర‌ణ చేసేట‌ప్పుడు అధికారులు మాన‌వీయ కోణంతో ఆలోచించాల‌ని నొక్కిచెప్పారు. భూ నిర్వాసితుల‌ పట్ల సానుభూతితో వ్య‌వ‌హ‌రించాల‌ని, భూమిని ఇస్తున్నవారికి ప్రభుత్వపరంగా వీలైనంత ఎక్కువ ప‌రిహారం ఇవ్వ‌డంతో పాటు అద‌నంగా ఏ రసూపంలో స‌యం చేయ‌గ‌ల‌మో పరిశీలించి దాన్ని అమలు చేయాలన్నారు. ఆర్ఆర్ఆర్‌, రేడియ‌ల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూ స‌మీక‌ర‌ణ‌, భూ సేక‌ర‌ణ విష‌యంలో అన్ని శాఖ‌ల అధికారులు సమన్వయంతో క‌లిసి ప‌ని చేయాల‌ని, సమిష్టి కృషితో ఫ‌లితాలు రావడమే ల‌క్ష్యంగా వారి ప‌నితీరు ఉండాల‌న్నారు. స‌మీక్ష‌ చేసిన ప్రతిసారీ గతంతో పోల్చినప్పుడు తగినంత ప్ర‌గ‌తి క‌న‌ప‌డాల‌ని, అలా లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి వెనుకాడ‌బోన‌ని హెచ్చ‌రించారు.

ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య నైట్ సఫారీ :

ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మ‌ధ్య రావిర్యాల నుంచి అమ‌న్‌గ‌ల్ వ‌ర‌కు నిర్మించ‌నున్న ర‌హ‌దారిలో మూడు చోట్ల అట‌వీ ప్రాంతాల‌ ఉన్నాయని, అక్కడ నైట్ స‌ఫారీలను ఏర్పాటు చేయడం, దానికి తగిన ప్లానింగ్‌, కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించాల‌ని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అట‌వీ ప్రాంతం స‌మీపంలోనే అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, ఫోర్త్ సిటీ ఉన్నాయని, ఇది చాలా అరుదైన పరిణామమన్నారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు బెంగ‌ళూరులో జిందాల్ నేచ‌ర్ కేర్ పెట్టార‌ని, మ‌న‌కు ఉన్న అట‌వీ ప్రాంతం, దానికున్న అనుకూల‌త‌లు తెలియ‌జేస్తే అటువంటివి చాలా వ‌స్తాయ‌న్నారు. ఫోర్త్ సిటీలోని ప‌రిశ్ర‌మ‌ల‌కు అట‌వీ ప్రాంతాల‌ను అనుసంధానిస్తే అభివృద్ధి చేసే అవ‌కాశం ఉంటుందని సూచించారు. అమెరికాలో ఐ-ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ప‌రిశ్ర‌మ అక్క‌డ యాపిల్ తోట‌లోనే ఉన్నదని ముఖ్య‌మంత్రి వివరించారు. రాచ‌కొండ ప‌రిధిలోని లోయ‌లు, ప్ర‌కృతి సౌంద‌ర్యం సినీ ప‌రిశ్ర‌మ‌ను ఆక‌ర్షించ‌డానికి ఉన్న అవ‌కాశాల‌నూ సీఎం వివ‌రించారు.

ఆర్ఆర్ఆర్ సౌత్ పార్ట్ అలైన్‌మెంట్‌పై రివ్యూ సంద‌ర్భంగా ఇన్‌ల్యాండ్ వాట‌ర్ వేస్ అంశం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. రైలు, జల మార్గంతో కూడిన ఇన్‌ల్యాండ్ వాట‌ర్ వే ల‌కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంద‌ని సీఎంకు అధికారులు వివరించారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో ఎక్క‌డైనా అలాంటిది ఉన్నదా?.. దాని స‌క్సెస్ రేట్ ఎలా ఉన్నది?.. కేవలం ప్ర‌తిపాద‌న‌లకే పరిమితమయ్యాయా?.. వాస్త‌వరూపం దాల్చే అవ‌కాశాలు ఏ మేరకున్నాయి?.. వీటిపై అధ్య‌య‌నం చేసి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. ఈ స‌మీక్ష‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి, సీఎం అడ్వయిజర్ వేం న‌రేందర్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌) శ్రీ‌నివాస‌రాజు, చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్‌రాజ్‌, స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ హ‌రిచంద‌న‌, రెవెన్యూ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ న‌వీన్ మిట్ట‌ల్‌, హెచ్ఎండీఏ మెట్రోపాలిట‌న్ క‌మిష‌న‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, పీసీసీఎఫ్ డోబ్రియ‌ల్‌, టీజీఐసీసీ ఎండీ విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి షాన‌వాజ్ ఖాసీం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed