- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త సంవత్సరం వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: నా తెలంగాణ కోటి రతనాల వీణ... అంటూ కవి దాశరధి అక్షరాలకు ఆచరణగా కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షతో పాటు కొత్త ఏడాదిలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతి గడపనా సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘రైతు - మహిళ - యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నామని నొక్కిచెప్పిన సీఎం... కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో రెండింటిని ఇప్పటికే అమలు చేస్తున్నామని, కొత్త ఏడాదిలో మిగిలినవాటినీ ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన న్యూ ఇయర్ మెసేజ్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందాలని, అభివృద్ధిలో యావత్తు దేశంలో తెలంగాణ అగ్రభాగాన ఉండాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రజలందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని గుర్తుచేశారు. “నిర్భందాన్ని, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం” అని సీఎం రేవంత్ తన సందేశంలో ప్రస్తావించారు. గత పాలనలో స్థంభించిపోయిన పాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు పేర్కొన్నారు.
యువత భవితే ప్రభుత్వానికి ప్రాధాన్యమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకూ కట్టుబడి ఉన్నామని గుర్తుచేశారు. ప్రజా పాలనకు అనుగుణంగా అన్ని వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్నదన్నారు. కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్) వ్యవస్థలో మానవీయతను జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
ఆర్థిక, విద్యుత్ రంగాలలో గత పాలనలో జరిగిన అరాచకాన్ని, విధ్వంసాన్ని వివరిస్తూ వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచామన్నారు. తర్వలోనే సాగునీటిరంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేతపత్రాన్ని జనంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నట్లు తెలిపారు. దాని ద్వారా ప్రజలకు ఆ రంగంలోని అవకతవకలను కూడా వివరిస్తామని, వాస్తవాలను వెల్లడిస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్ని రూపాల్లోని అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చినట్లుగానే ఆ దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు తెలిపారు. “ఇది గత పాలన కాదు.. జన పాలన.. ప్రతి పౌరుడూ ఈ ప్రభుత్వాన్ని చేరుకోవచ్చు.. ఇందుకు 24 గంటలో ద్వారాలు తెరిచే ఉంటాయి..” అని తన సందేశంలో సీఎం రేవంత్ నొక్కిచెప్పారు.
ఫించన్లు, రేషన్ కార్డులు, ఇండ్ల కోసం లక్షలాది మంది అర్హులు పదేళ్లుగా ఎదురు చూశారని, అతి త్వరలోనే వారి ఆశలు ఫలిస్తాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున సంక్షేమ ఫలాలు అందుతాయని భరోసా ఇచ్చారు. అధికారం కోల్పోయిన దుగ్ధతో, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలను, అసత్య ప్రకటనలను చూసి గందరగోళపడవద్దని పిలుపునిచ్చారు.
తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలన్నింటినీ సేకరిస్తున్నామని, వాటి నుంచి వీలైనంత తొందరలోనే విముక్తి కల్పించేలా ప్రభుత్వం ప్రయత్నాలను మొదలుపెట్టిందని, త్వరలోనే కొలిక్కి రానున్నట్లు వివరించారు. ఆటో కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి తలా రూ.5 లక్షల చొప్పున బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. జర్నలిస్టుల సంక్షేమం పట్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉన్నదని, త్వరలో వాళ్ల సమస్యలకూ పరిష్కారం లభిస్తుందన్నారు.