CM Revanth Reddy: బీసీలకు నేను మాటిస్తున్నా.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2025-03-17 11:42:12.0  )
CM Revanth Reddy:  బీసీలకు నేను మాటిస్తున్నా.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ‘కేసీఆర్‌కు, బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా.. మనందరం వీలైనంత త్వరగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) దగ్గరకు వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించుకుందాం’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఇవాళ శాసనసభలో బీసీ బిల్లుపై (BC Bill) మాట్లాడిన సీఎం బిల్లుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐతో పాటు అన్నిరాజకీయ పార్టీలను కలుపుకొని పోతామన్నారు. ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని చెప్పారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తాను నాయకత్వం వహిస్తానని ఈ సభా నాయకుడిగా మాటిస్తున్నానన్నారు.

అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యత వారిదే

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ జరగాలని రేవంత్ పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందునా చట్ట సవరణ కోసం ప్రధాని మోడీని, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని అందరం కలిసికట్టుగా కలుద్దామని సూచించారు. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యత కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్‌ దేనన్నారు (Bandi Sanjay). పీఎం అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాయాలని సీఎస్‌కు ఆదేశాలిస్తున్నానని చెప్పారు. బలహీనవర్గాలకు రిజర్వేషన్ల అంశంలో మనందరి అభిప్రాయాలు ఒక్కటే అయినప్పుడు ఒకరినొకరు విభేదించుకోవాల్సిన, విమర్శించుకోవాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించామని, ఆ ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నట్లు రేవంత్ చెప్పారు. ఈ మేరకు బీసీ కులగణన చేశామని తెలిపారు.

కామారెడ్డి ప్రకటనకు మేం కట్టుబడి ఉన్నాం:

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆనాడు హామీ ఇచ్చారు. మేం బాధ్యతలు చేపట్టగానే 4 ఫిబ్రవరి 2024లో బీసీ కులగణన ప్రక్రియను మొదలు పెట్టామని సీఎం అన్నారు. బీసీ రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదన పంపితే దాన్ని ఉపసంహరించుకుని 42 శాతం పెంచేందుకు కొత్త ప్రతిపాదన పంపిస్తున్నామని సీఎం చెప్పారు. 4 ఫిబ్రవరిని సోషల్ జస్టిస్ డే గా సభ ద్వారా తీర్మానం చేశామని అందరినీ సంప్రదించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు చెప్పారు. కులసర్వేలో పొందుపరిచిన బీసీల లెక్క వందశాతం సరైనవని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. 1979లో మండల్ కమిషన్ వేశారు. మండల్ కమిషన్ తోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration) లోప్రకటించామని కామారెడ్డి ప్రకటనకు మేం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు

Next Story

Most Viewed