- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Madhya Pradesh: రెండేళ్ల క్రితం హత్య.. నలుగురికి శిక్ష.. ఇప్పుడు ఆమె తిరిగొచ్చింది

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్లో చనిపోయిందనుకున్న మహిళ ఇంటికి తిరిగి వచ్చి షాక్ ఇచ్చింది. మందసౌర్ జిల్లాలో 2023లో హత్యకు గురైందని భావించిన ఓ మహిళ దాదాపు రెండేళ్ల తర్వాత మార్చి 11న క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. కాగా.. ఆ మహిళ హత్య కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారు. 2023 సెప్టెంబర్లో మందసౌర్లోని గాంధీ సాగర్ ప్రాంతానికి చెందిన లలితా బాయి (35) అనే మహిళ కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని ఝబువాలోని థాండ్లా పట్టణంలో ఆమె 'హత్య' జరిగిదని కేసు నమోదైంది. తల ఛిద్రమైన మహిళ డెడ్ బాడీని లలితాబాయి బంధువులకు అధికారులు చూపించారు. “మేము మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత, తల ఛిద్రమైన మహిళ మృతదేహం లభ్యమైనట్లు తండ్లా పోలీసులు మాకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి పచ్చబొట్టు, కాలుకు ఉన్న నల్లని తీగ ఆధారంగా అది మా కుమార్తె మృతదేహంగా గుర్తించాం. అంత్యక్రియలు కూడా నిర్వహించాం” అని లలిత తండ్రి నానురామ్ బంచాడ తెలిపారు.
రూ.5 లక్షలకు అమ్మకం
అయితే, మందసౌర్ జిల్లాలోని నవాలీ గ్రామానికి చెందిన లలితా బాయి (35) షారూఖ్ అనే వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కానీ షారుఖ్.. తన పేరుతోనే ఉన్న మరో వ్యక్తికి లలితా బాయిని రూ. 5లక్షలకు అమ్మేశాడు. రెండో వ్యక్తి తనను రాజస్థాన్లోని కోటాకు తీసుకెళ్లాడని.. అక్కడ దాదాపు 18 నెలల పాటు అతనితో ఉన్నట్టు లలితా బాయి చెప్పింది. ఆమె దగ్గర ఫోన్ కూడా లేదని.. అందుకే కుటుంబసభ్యులను సంప్రదించలేకపోయామని తెలిపింది. అయితే, అవకాశం వచ్చిన వెంటనే పారిపోయి ఇంటికి తిరిగి వచ్చినట్టు లలితాబాయి వివరించింది. మహిళ తిరిగి వచ్చిన తర్వాత ఆమె తండ్రి ఆమెను గాంధీ సాగర్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి ఆమె బతికే ఉందని అధికారులకు సమాచారం అందించాడు. దీంతో గాంధీసాగర్ పోలీసులు తండ్లాలోని పోలీసులకు సమాచారం అందించారు.మరోవైపు, లలితాబాయిని ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలతో షారూఖ్ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇకపోతే, లలితా బాయి హత్య కేసులో జైలులో ఉన్న నలుగురిపై తండ్లా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని మందసౌర్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ ఆనంద్ తెలిపారు. ఈ విషయంపై స్థానిక కోర్టు సమాచారం కోరిందని, గాంధీ సాగర్ పోలీస్స్టేషన్ కు వచ్చిన మహిళ హత్యకు గురైన మహిళేనా అని నిర్ధారించడానికి సమగ్ర విచారణ జరుపుతామని ఝబువా ఎస్పీ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు. అంతేకాకుండా, బాధితురాలికి వైద్యపరీక్షలు, డీఎన్ఏ టెస్టు నిర్వహిస్తామన్నారు. సాక్ష్యుల వాంగ్మూలాలను మరోసారి తీసుకుంటామని తెలిపారు.