అసెంబ్లీకి రమ్మంటే టీవీల్లో డిబేట్‌లా.. KCRపై CM రేవంత్ రెడ్డి సీరియస్

by Rajesh |   ( Updated:2024-04-24 13:56:46.0  )
అసెంబ్లీకి రమ్మంటే టీవీల్లో డిబేట్‌లా.. KCRపై CM రేవంత్ రెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం చీడను విరగడ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వరంగల్ జిల్లా అంటే దాశరథి, కాళోజీ, జయశంకర్ గుర్తొస్తారన్నారు. రెండో రాజధానిగా వరంగల్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. వరంగల్ లో ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. పరిశ్రమలు, ఐటీ ప్రాజెక్టులలో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్‌ తెస్తామన్నారు. వరంగల్‌లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి ఎకరానికీ నీళ్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వంలో కడియం శ్రీహరి అనుభవాన్ని వినియోగించుకుంటామన్నారు. వర్షం వస్తే వరంగల్ సముద్రంలా మారిపోతోందని.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వరంగల్ జిల్లాఅంటే పీవీ గుర్తొస్తారని పేర్కొన్నారు. త్వరలో కాకతీయ యూనివర్సిటీకి కొత్త వీసీని నియమిస్తామని హామీ ఇచ్చారు. కాకతీయ వర్సిటీని ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. కొంత మంది అధికారం పోయి తోక తెగిన బల్లులా ఎగురుతున్నారని.. కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే రాలేదన్నారు. కేసీఆర్ కట్టిన అద్భుతమేంటో మేమంతా చూస్తామని.. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం వెళ్దాం.. రా అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ కు ఎక్కడైనా డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ నాణానికి రెండు ముఖాలు అని.. మోడీ హామీలు అమలు అయ్యాయో లేదో బీజేపీ నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ఓ టీవీ ఛానెల్ చర్చకు వెళ్లారని.. 4 గంటల పాటు కూర్చున్నారని ఫైర్ అయ్యారు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని.. మేడిగడ్డ మేడిపండులా మారిపోయిందని సెటైర్లు వేశారు. అన్నారం బ్యారేజీ ఆకాశంలో కలిసిపోయిందన్నారు. కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదన్నారు.

తాము కట్టిన ప్రాజెక్టుల్లో ఎలాంటి లోపాలు లేవన్నారు. మోడీ, కేసీఆర్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పారని.. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఒక్క హామీ అయినా అమలు చేసిందా అని క్వశ్చన్ చేశారు. మోడీపై హర్యాణా రైతులు యుద్ధం ప్రకటించారని.. నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేలా చేశారన్నారు. మోడీ ప్రభుత్వం బయ్యారం ఉక్కు కర్మాగారం తిరస్కరించిందని గుర్తు చేశారు. వరంగల్ కు భారీగా పెట్టుబడులు తీసుకువస్తామన్నారు.

Read More...

రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని రెడీగా ఉండు.. హరీష్ రావుకు CM రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

Next Story

Most Viewed