CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక భరోసా

by Gantepaka Srikanth |
CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో ఆదివారం పర్యటించారు. శ్రీకురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘పేదల తిరుపతిగా కురుమూర్తి స్వామి ఆలయం(Kurumurthy Swamy Temple) ప్రసిద్ధి పొందింది. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నా’ అని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పాలమూరు వలసల జిల్లాగా మారిందని మండిపడ్డారు.

ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం కూడా గత పాలకుల నిర్లక్ష్యమే అని అన్నారు. తెలంగాణ(Telangana) వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి పాడిపంటలతో విలసిల్లేలా ఇక నుంచి ప్రభుత్వ నిర్ణయాలుంటాయని హామీ ఇచ్చారు. నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్టు(Narayanapet Kodangal Project) పూర్తిచేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తామని చెప్పారు. మా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు ఆరోపణలు చేసి చిల్లర రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

‘ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు. నాపై కోపం ఉంటే రాజకీయంగా నాపై కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దు... జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు. అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదు. నేను ఎక్కడ ఉన్నా.. ఈ జిల్లా అభివృద్దిని కాంక్షించేవాడినే. జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో 2 వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మాది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని జిల్లా కలెక్టర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందామని పిలుపునిచ్చారు. కాళ్లల్లో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించరని హెచ్చరించారు.

Advertisement

Next Story