నిరుద్యోగులకు CM రేవంత్ రెడ్డి శుభవార్త

by GSrikanth |   ( Updated:2024-02-15 11:36:14.0  )
నిరుద్యోగులకు CM రేవంత్ రెడ్డి శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. అతి త్వరలో గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 567 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాము చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు. రాష్ట్ర యువతను, నిరుద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమయం దొరకలేదని విమర్శించారు.

రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలను గాలికి వదిలేసి కేవలం దోచుకోవడం.. దాచుకోవడంపైనే బీఆర్ఎస్ నేతలు పదేళ్లు దృష్టి పెట్టారని సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా ఉద్యోగ నియామకాలపైనే దృష్టి పెట్టామని అన్నారు. ఒక్కొక్కటిగా ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నామని తెలిపారు. పోలీసు, ఎక్సై్జ్, ఫైర్ శాఖల్లో 13,444 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని గుర్తుచేశారు. త్వరలోనే గ్రూపు పరీక్షలన్నీ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తూనే.. బీఆర్ఎస్ చేసిన అవినీతి బట్టబయలు చేస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్టు పేకమేడలా కూలిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పారు.

Advertisement

Next Story