సంక్రాంతి వేళ ఆదివాసీలకు CM రేవంత్ రెడ్డి శుభవార్త

by Gantepaka Srikanth |
సంక్రాంతి వేళ ఆదివాసీలకు CM రేవంత్ రెడ్డి శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్వహించిన సమావేశం ముగిసింది. సమస్యలను ఆదివాసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీల విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు సీఎంను కోరాయి. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్డు రవాణా, సాగు, తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సభ ఇంద్రవెల్లి(Indravelli)లోనే పెట్టినట్లు గుర్తుచేశారు. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని చర్చించుకున్నట్లు తెలిపారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేసుకున్నామని అన్నారు. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కొమురం భీమ్ వర్ధంతి, జయంతులను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించే అంశాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్‌ను క్లియర్ చేయాలని అన్నారు.

మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా, రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి రిపోర్ట్ అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed