అదే తమ ఆశయం.. రిపబ్లిక్ డే వేళ CM రేవంత్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
అదే తమ ఆశయం.. రిపబ్లిక్ డే వేళ CM రేవంత్ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలని అందుకు మూలాధారమైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ముఖ్యంగా మహిళల సాధికారత కోసం వారికి ఉచిత బస్సు సౌకర్యం, రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ సహాయాన్ని రూ.10 లక్షలకు పెంపు వంటి సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగాల భర్తీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. వీటికి తోడు మరెన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గణతంత్ర దినోత్సవ శుభదినాన ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషకరమైన పరిణామమని అన్నారు. రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాల ప్రయోజనాలు అందాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణబద్ధులమై తెలంగాణను ప్రపంచ పటంలో ఆవిష్కరించాలన్న ఆశయంతో తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రసిద్ధి గాంచిన సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్ ను సమున్నత స్థానంలో చేర్చాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సమున్నత లక్ష్యంతో స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన, అడ్వాన్స్ డ్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ (ఏటీసీ)ల స్థాపన వంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికామన్నారు. గణతంత్ర దినోత్సవ శుభదినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు, సమున్నత స్థాయిలో దేశాన్ని నిలిపిన మహనీయులు అందరినీ స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు.a

Next Story

Most Viewed