- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొండపోచమ్మకు తీరిన దారి కష్టాలు

దిశ, బోయినిపల్లి : ఏట్టకేలకు కొండపోచమ్మ ఆలయానికి వెళ్లే దారి కష్టాలు తీరాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భక్తుల కల ప్రజా ప్రభుత్వంలో నెరవేరింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవతో ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి రూ.50లక్షల నిధులను మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరుగుతుండడంతో.. కొండపోచమ్మ అమ్మవారి భక్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు కుంటుపడ్డ ఆలయ అభివృద్ధికి ఇకపై బాటలు పడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం భక్తుల రద్దీ..
మండలంలోని కోరెం గ్రామ కొండపోచమ్మ దేవాలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అందులో ఆదివారం అయితే చాలు జన సందోహంతో ఆలయం కిటకిటలాడుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి మండల, జిల్లా ప్రజలే కాకుండా పక్క జిల్లాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు.
ఏళ్లుగా ఎదురుచూపులు..
ప్రతిరోజు భక్తులు, ప్రయాణికులతో రద్దీగా ఉండే కొండపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిలో అధిక వర్షాల వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి పూర్తిగా అధ్వానంగా తయారైంది. వాహనాలే కాక భక్తులు కూడా నడవ లేని పరిస్థితి నెలకొన్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా తాత్కాలిక ప్రయోజనం మాత్రమే చేకూరింది. దీంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు నిత్యం నరకయాతన పడేవారు.
ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు...
ఎన్నో ఏళ్లుగా భక్తులు, ప్రజలు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవతో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్, జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద ఆలయ రోడ్డు నిర్మాణానికి రూ.50లక్షల నిధులను విడుదల చేసింది. 850మీటర్ల పొడవు, 12ఫీట్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. వర్షపు నీటితో సైతం భక్తులు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పెద్ద పైపులైన్లను ఏర్పాటు చేసి నీటిని వాగులోకి మళ్లించి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఆలయ రోడ్డు నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతుండడంతో అటు భక్తులు, ఇటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పట్టు వదల్లేదు.. వన్నెల రమణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
కొండపోచమ్మ ఆలయ రోడ్డు నిర్మాణం చేయించాలని పట్టు పట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేతో నిధులు మంజూరు చేయించాలని పట్టువదలకుండా గుంతల దారిని సీసీ రోడ్డు వేయించేలా చేశాం. ఆలయానికి వచ్చే భక్తులకు శాశ్వత పరిష్కారం చేయించినందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులకు భక్తులు, మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.
విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి
కొండపోచమ్మ ఆలయానికి వెళ్లడానికి సీసీ రోడ్డు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే రోడ్డు పొడవునా, గుడి చుట్టూ విద్యుత్ స్తంభాలు వేసి వాటికి ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలి. రాత్రివేళలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. విద్యుత్ దీపాల ఏర్పాటుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం.
- మ్యాకల మహేష్, గ్రామస్తుడు