CM Revanth: కేంద్రానికి కేసీఆర్ ఆనాడు ఊడిగం చేసిండు.. అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్

by Shiva |
CM Revanth: కేంద్రానికి కేసీఆర్ ఆనాడు ఊడిగం చేసిండు.. అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల బుధవారం శాసనసభ దద్దరిల్లింది. నిధుల కేటాయింపు విషయంలో అసెంబ్లీలో చర్చ ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు రావాలంటే పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు గొంతు విప్పి కోట్లాడాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆనాడు మోదీ మొదటి ప్రభుత్వంలో రాజ్యసభలో బీజేపీ బలం లేకపోతే పలు బిల్లుల ఆమోదానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏకంగా నరేంద్ర మోడీకి ఊడిగం చేశారంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.

జీఎస్టీ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వకుండా ఓటింగ్‌లో పాల్గొనకుండా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారని ఆరోపించారు. దేశంలో పారదర్శక పాలన అందించేందుకు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్ట్‌కు తూట్లు పొడిచేలా ఆర్టీఐ సవరణ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఓటింగ్ పాల్గొనిందని తెలిపారు. 2016 డిసెంబర్ 16న పెద్ద నోట్ల రద్దు బిల్లు స్వాగతిస్తూ.. కేసీఆర్ ఇదే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రధాని నిర్ణయం అద్బుతం, అమోఘమని పొగిడారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇలా ప్రతి విషయంలోనే బీజేపీ, బీఆర్ఎస్‌‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.



Next Story