కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ

by Mahesh |   ( Updated:2024-09-19 16:42:04.0  )
కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఈ విషయమై పలు సమావేశాల్లో చర్చించింది. అక్టోబరులో దరఖాస్తులను ఆహ్వానించేలా ఆలోచిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై మంత్రులు, అధికారులు చర్చించిన తర్వాత షెడ్యూల్ ఫైనల్ అయింది. అన్ని జిల్లాల్లో అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై అధికారులతో చర్చించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల సమావేశమై కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను ఆహ్వానించడంపై చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ తాజా భేటీలో ప్రస్తావించారు. అర్హులైన కుటుంబాలన్నింటికీ డిజిటల్ రేషన్ కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కొత్త రేషను కార్డుల కోసం దరఖాస్తుల్ని అక్టోబరు ఫస్ట్ వీక్‌లో ఆహ్వానించి నెల చివరికల్లా ఫైనల్ చేసి కార్డుల్ని లబ్ధిదారులకు అందించే విధంగా అధికారులతో సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు రోజుల క్రితం జల సౌధ లో సమావేశమై చర్చించారు. దానికి అనుగుణంగానే సీఎం అధ్యక్షతన తాజా రివ్యూ మీటింగ్‌లో అక్టోబరు 2 నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టాలనే నిర్ణయం జరిగింది. రేషన్ కార్డులకు ఉండాల్సిన అర్హతలపై అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా వివిధ స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ లేఖలు రాసింది. ఎన్సీ సక్సేనా కమిటీ సిఫారసు చేసిన నిబంధనలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నట్లు మంత్రి ఉత్తమ్ ఇటీవల వెల్లడించారు. గత ప్రభుత్వంలో సుమారు 6.47 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ అయితే 5.98 లక్షల కార్డులు డిలీట్ అయినట్టు మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, వీటి ద్వారా 2.80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు.

గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురుచూసినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు స్వీకరించకపోవడంతో ఇప్పుడు వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. అప్పటికల్లా అర్హతకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించనున్నది. గతంలో కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలో పర్యటించి అర్హతలపై అభిప్రాయాలను స్వీకరించింది. ఆ విషయాలనే మూడు రోజుల క్రితం జరిగిన సమావేశంలోనూ చర్చించారు. పల్లెల్లో (రూ. 1.5 లక్షలు), పట్టణాల్లో (రూ. 2.00) కుటుంబ వార్షికాదాయ పరిమితితో పాటు మెట్ట (ఏడున్నర ఎకరాలు), తరి (మూడున్నర ఎకరాలు) విస్తీర్ణం ఉండేలా నిబంధనలు పెట్టనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్, జనవరి నెలల్లో పది రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన ప్రోగ్రామ్‌లో అభయహస్తం పేరుతో కొత్త రేషను కార్డుల కోసం దాదాపు 11.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని కంప్యూటరైజ్ చేసిన ప్రభుత్వం మరోమారు అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నది.

సీఎం అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ పాల్గొని అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చే విధానంపై చర్చించారు. ఈ అంశంపై త్వరలోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ శేషాద్రి, కార్య‌ద‌ర్శులు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, సంగీతా స‌త్య‌నారాయ‌ణ‌, మాణిక్‌రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ప్రిన్సిప‌ల్ కార్యద‌ర్శి డీఎస్‌ చౌహాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed