సీఎం కేసీఆర్‌ దంపతులకు జగద్గురువుల ఆశీర్వాదం

by Javid Pasha |
సీఎం కేసీఆర్‌ దంపతులకు జగద్గురువుల ఆశీర్వాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ సాదు పుంగవులను ఆదరించడం గొప్ప విషయమని, అందుకు సీఎం కేసీఆర్ అభినందనీయుడని జగద్గురువులు అభినందించారు. ‘‘ వేలాదిమంది సాదువులను ఏక కాలంలో ఆహ్వానించి వారిని గౌరవించడం ఆనాడు జనకమహారాజుకే సాధ్యమైంది. తిరిగి నేడు వర్తమాన భారతదేశంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ కే సాధ్యమైంది. సాధు సంతులను ఆదరించే విషయంలో ‘కేసీఆర్ కలియుగ జనకుడు’..’’ అని వారు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా వీరశైవ పంచపీఠంలోని జగద్గురువులను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర శివాచార్య మహాస్వామి (కాశీ), సిద్దలింగ శివాచార్య మహాస్వామీజీ ( ఉజ్జయినీ) చెన్నసిద్ధ రమా పండితారాధ్య శివాచార్య మహాస్వామి(శ్రీశైలం) లు శనివారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్నారు.

వారితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు శివాచార్య మహాస్వామీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వారు అభినందించారు. భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన నయా భారత్ నిర్మాణంలో తమ సహకారం ఆశీర్వాదాలు అన్ని సందర్భాల్లోనూ ఉంటాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన వేదపండితులు ఆచార్యులు సీఎం కేసీఆర్ దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించి, ఫల ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ దంపతులు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శంకరన్న దోండ్గే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story