దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ హోళీ శుభాకాంక్షలు

by GSrikanth |
దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ హోళీ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హోళీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోళీ పండుగ స్వాగతం పలుకుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోళీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సాంప్రదాయం రమణీయమైనదన్నారు. రాష్ట్ర, దేశ ప్రజలందరికీ హోళీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. హోళీ పండుగ నేపథ్యంలో పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే చిన్నారుల జాజిరి ఆటా పాటలతో, కోలాటాల చప్పుల్లతో ఉత్తేజం వెల్లివిరుస్తుందని తెలిపారు.

పిల్లా పెద్దా అనే తేడా లేకుండా సింగిడి రంగుల నడుమ ఖేలీ కేరింతలతో సాగే హోళీ, మానవ జీవితమే ఒక వేడుక అనే భావనను, ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని మనకందిస్తుందన్నారు. బేధ భావాలను వీడి పరస్పర ప్రేమాభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్దమైన రంగులతో హోళీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం సూచించారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి కార్యాచరణ, తెలంగాణలోని దళిత బహుజన, సకల జనుల జీవితాల్లో నిత్య వసంతాన్ని నింపిందని సీఎం తెలిపారు. దేశ ప్రజలందరి జీవితాల్లో నూతనోత్తేజం వెల్లివిరిసేదాకా తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed