- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ న్యూస్: ‘‘గులాబీ’’ పండుగలా నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్.. ప్రతిపక్షాల హాజరుపై తీవ్ర ఉత్కంఠ!
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 30న మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ చీఫ్ గెస్టుగా ప్రారంభించనున్నారు. విపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులందరికీ ప్రభుత్వం తరఫున ఇన్విటేషన్లు వెళ్ళాయి. కానీ హాజరుకావడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉన్నారు. ఆ పార్టీకి చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు వేర్వేరు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరుకావడానికి ఉత్సాహం చూపడంలేదు. చివరకు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు మాత్రమే హాజరవుతున్నారు. మంత్రులు, అధికారుల సమక్షంలో కొత్త సచివాలయాన్ని కేసీఆర్ ప్రాంరంభించి ఆరో అంతస్తులోని ఆయన ఛాంబర్‌లోకి వెళ్తారు.
సరిగ్గా మధ్యాహ్నం 1.58-2.04 గంటల మధ్య మంచి ముహూర్తం ఉన్నదంటూ ప్రోగ్రామ్ షెడ్యూలు ఇప్పటికే ఫిక్స్ అయింది. ఆ ఆరు నిమిషాల మధ్యలోనే మంత్రులంతా వారికి కేటాయించిన ఛాంబర్లలో పూజలు చేసి సీట్లో కూర్చుని ఆ శాఖకు సంబంధించిన ఒక ఫైల్‌పై సంతకం చేసేలా షెడ్యూలు రూపొందింది. మంత్రులందరికీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటికే సమాచారం వెళ్ళింది. ఒకేసారి ముఖ్యమంత్రి, మంత్రులు ఈ కార్యక్రమాన్ని ముగించనున్నారు. ఆయా శాఖల కార్యదర్శులు సైతం వారి చాంబర్లలో ఆ సమయానికి ఆసీనులై ఒక్కో ఫైల్‌పై సంతకం చేస్తారు. మంత్రులు వారివారి ఛాంబర్లలో ప్రవేశించి కుర్చీల్లో ఆసీనులయ్యే కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళడానికి అనుమతి లభించింది.
సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం వెళ్ళలేదని అధికారుల సమాచారం. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం అయినప్పటికీ ఆమెను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎత్తయిన విగ్రహాన్ని ఈ నెల 14న ప్రారంభించినప్పుడు కూడా గవర్నర్‌ను ప్రభుత్వం ఆహ్వానించలేదు. ప్రోటోకాల్ లభించడంలేదంటూ ఆమె పదేపదే వాపోతున్నా దానికి తగినట్లుగానే వ్యవహారం జరుగుతుండడం గమనార్హం. ఎలాగూ విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకావడం లేదని ఇప్పటికే సంకేతాలు అందాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తాను హాజరుకావడంలేదంటూ బహిరంగంగానే చెప్పారు. మిగిలినవారిది కూడా ఇదే దారి.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఒక పార్టీ ఈవెంట్‌లాగానే జరిగింది. ఇప్పుడు నూతన సచివాలయం ప్రారంభోత్సవం కూడా అదే తరహాలో జరగనున్నది. కేవలం అధికార పార్టీకి చెందిన నేతల సమక్షంలోనే జరుగుతుండడంతో ఇదో గులాబీ ఉత్సవం తరహాలోనే ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 17న గ్రాండ్ ఓపెనింగ్ కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్ళింది. కానీ ఈసారి మాత్రం అలాంటి గెస్టులెవరూ లేకుండా కేసీఆరే చీఫ్ గెస్టుగా జరగనున్నది. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, కమిషన్ల చైర్‌పర్సన్లు, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్లు, సహకార బ్యాంకుల చైర్‌పర్సన్లు తదితరులందరికీ ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ప్రభుత్వం తరఫున ఇన్విటేషన్లు వెళ్లాయి. వారంతా హాజరవడానికి ఉత్సాహంగా ఉన్నారు.
ముఖ్యమంత్రి స్పీచ్‌పై ఆసక్తి
సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే ప్రసంగం, అందులో ప్రస్తావించే అంశాలపై గులాబీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొన్నది. మధ్యాహ్నం దాదాపు అరగంట పాటు కేసీఆర్ ప్రసంగం ఉండేలా షెడ్యూలు ఖరారైంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో 2.15 గంటల నుంచి 2.45 వరకు కొనసాగనున్నది. ఆ తర్వాతనే అందరికీ అక్కడ లంచ్ ఏర్పాటైంది. కేసీఆర్ స్పీచ్ సమయానికి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులంతా అక్కడకు చేరుకోనున్నారు. రాష్ట్రం మొత్తానికి పరిపాలనా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నందున అన్ని జిల్లాల కలెక్టర్లను రావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే సర్క్యూలర్ జారీచేసింది. వివిధ కార్పొరేషన్లు, హెచ్ఓడీలను కూడా రావాల్సిందిగా స్పష్టం చేసింది.
సచివాలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరవుతున్నందున భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే సచివాలయానికి దారితీసే అనేక రోడ్ల మీద ట్రాఫిక్‌ను పోలీసులు దారి మళ్ళించేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 గంటల తర్వాత కూడా పలు రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు కొనసాగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. సచివాలయానికి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ, నగర పోలీసు కమిషనర్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు చుట్టూ కలియతిరిగి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీచేశారు. అన్ని డిపార్టుమెంట్ల సమన్వయం, సమిష్టి సహకారంతో ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ, జీఏడీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీచేశారు.