AP News : ఏపీ రాజకీయాల్లోకి KCR.. వచ్చే నెలలో విజయవాడ టూర్

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-16 06:27:52.0  )
AP News : ఏపీ రాజకీయాల్లోకి KCR.. వచ్చే నెలలో విజయవాడ టూర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల 14 నుంచి 18 వరకు విజయవాడలో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో కేసీఆర్ హాజరవుతారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సమావేశాల్లో దేశానికి దశ, దిశ నిర్దేశించే రాజకీయ తీర్మానం చేస్తామని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డి, పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన వీరు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లు గడుస్తున్న విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని మండిపడ్డారు.

విజయవాడలో జరగబోయే సీపీఐ జాతీయ మహాసభలకు 20 దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ నేతలు హాజరు అవుతారని చెప్పారు. అలాగే కేరళ, బిహార్, తెలంగాణ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, నితీశ్ కుమార్, కేసీఆర్ లు పాల్గొంటారని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇది మునుగోడు ఉప ఎన్నిక వరకే ఉంటుందని పైకి చెబుతున్నా రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు ఈ బంధం కొనసాగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది.

ఈ నేపథ్యంలో విజయవాడలో సీఎం కేసీఆర్ టూర్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష నేతలంతా ఏకతాటిపైకి రావాలని కేసీఆర్, నితీష్ కుమార్ ఇప్పటికే కసరత్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న కమ్యూనిస్టులు ఏపీలో నిర్వహిస్తున్న పార్టీ మహాసభలకు కేసీఆర్ ను ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. ఏపీలో రాబోయే ఎన్నికల నాటికి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ మాట ఎలా ఉన్నా బీజేపీ, జనసేన మధ్య స్నేహబంధం ఉందనేది కమలం పార్టీ నేతల మాటలను బట్టి చూస్తే అర్థం అవుతోంది. ఇటీవల మోడీతో చంద్రబాబు భేటీ కావడంతో ఆయన తిరిగి ఎన్డీయేలో జాయిన్ అవుతారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీతో జగన్ సత్సంబంధాలు కొనసాగిస్తుండగా అదే బీజేపీతో చంద్రబాబు ఏ మేరకు కలిసి పోతారనేది సందేహామే. ఈ నేపథ్యంలో ఏపీలోకి కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

'త్వరలో కరెన్సీ నోట్లపై మోదీ బొమ్మ ముద్రిస్తారా?'

కేసీఆర్ వ్యూహంలో చిక్కిన మోడీ.. చక్రబంధంలో తెలంగాణ బీజేపీ

Advertisement

Next Story

Most Viewed