మెట్టు దిగొచ్చిన కేసీఆర్.. ఆ అంశంపై ఓ‌పెన్‌గా చర్చించేందుకు రెడీ!!

by GSrikanth |   ( Updated:2022-11-26 03:04:06.0  )
మెట్టు దిగొచ్చిన కేసీఆర్.. ఆ అంశంపై ఓ‌పెన్‌గా చర్చించేందుకు రెడీ!!
X

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఓ‌పెన్‌గా చర్చించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు నిధుల పరిస్థితి, కొత్త పథకాల అమలుకు ఎదురవుతున్న ఫైనాన్షియల్ ఇబ్బందులపై క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇందుకు కేంద్రాన్ని కారణంగా చూపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, అప్పులకు సైతం అడ్డుపడుతున్నదని సెంట్రల్‌ను కార్నర్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఓపెన్‌గా చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? ఏయే పథకాలకు నిధుల కొరత ఉంది? ఏయే స్కీమ్స్‌ను ఒకే సారి కాకుండా దశల వారీగా అమలు చేయనున్నారనే అంశాలపై సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు. కొన్ని పథకాల అమలుపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా అదిగో, ఇదిగో అంటూ ప్రభుత్వం కాలం వెల్లదీస్తున్నది. మరి ఈ పథకాలు అమలవుతాయా? అయితే ఎలా ఎప్పటి నుంచి అవుతాయనే దానిపై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు. ఈ నిధుల కొరతకు కేంద్రమే కారణమని, అప్పులు సైతం ఇవ్వడం లేదనే విషయాన్ని ప్రకటించి సెంట్రల్‌ను కార్నర్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అమలు కావాల్సిన పథకాలకు కేంద్ర ప్రభుత్తమే అడ్డుపడుతున్నదని ఎదురుదాడికి దిగాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు. అప్పులు విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి పేచీలు పెడుతుంది? కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసింది? అనే వివరాలను గణాంకాలతో సహా కేసీఆర్ వివరించనున్నట్టు సమాచారం.

హామీలు అటకమీదే..

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొన్ని పథకాల అమలు కష్టమనే అభిప్రాయం అధికార పార్టీ నేతల్లోనూ ఉంది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన చాలా హామీలను ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదు. నిరుద్యోగభృతి, రుణమాఫీ తదితర స్కీంలు అమలుకు నోచుకోలేదు. వీటిపైనా కేసీఆర్ ప్రకటన చేసే చాన్స్ ఉంది. వీటిని అమలు చేస్తారా? లేదంటే కష్టమనే విషయాన్ని స్పష్టం చేస్తారా? అనే చర్చలు కొనసాగుతున్నాయి. లక్ష లోపు రైతురుణాన్ని మాఫీ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.50 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. నిరుద్యోగ భృతి పైనా ప్రభుత్వం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

ఈ సారి గిరిజనబంధు కష్టమే..

ప్రస్తుత బడ్జెట్‌లో దళితబంధు అమలులో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 1500 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ముందుగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధుల కొరత వల్ల కేవలం 500 మందికే చెక్కులు ఇవ్వాలని భావిస్తున్నది. మరి మిగతా వారికి ఎప్పుడు ఇస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దళితబంధుకే నిధుల లేక సతమతమవుతున్న ప్రభుత్వం.. ఈ సారి గిరిజనబంధును అమలు చేయడం కష్టమనే వాదనలు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కానీ రాజకీయంగా వచ్చే విమర్శలను అడ్డుకట్ట వేసేందుకు ఎంతో కొంత మంది లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులు మంజూరు చేసే చాన్స్ ఉందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ప్రభుత్వ భూముల అప్పకంపై వచ్చే సొమ్ముపై సర్కారు గంపెడాశలు పెట్టుకున్నది. దాదాపు రూ.12 కోట్లు వస్తాయని ఆశించింది. ఇందుకోసం స్పెషల్‌గా మీటింగ్స్ పెట్టి భూములను గుర్తించారు. కానీ, అక్టోబర్ చివరి నాటికి కేవలం రూ.1100 కోట్లు మాత్రమే వచ్చినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed