KCR: ఉత్తర తెలంగాణ నేతలకు గులాబీ బాస్ వార్నింగ్!

by GSrikanth |   ( Updated:2023-05-27 03:10:01.0  )
KCR: ఉత్తర తెలంగాణ నేతలకు గులాబీ బాస్ వార్నింగ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర తెలంగాణలోని మూడు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ఎదురుగాలి వీచేలా కనిపిస్తుంది. అక్కడ పార్టీ పరిస్థితి బాగోలేదంటూ గులాబీ బాస్ ఆయా జిల్లాల లీడర్లకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉందని అలర్ట్ చేసినట్టు సమాచారం. వెంటనే పార్టీ యాక్టివిటీస్ పెంచాలని, బీజేపీపై పాజిటీవ్ గా ఉన్న యూత్ ను తమ వైపు తిప్పుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ప్రచారంలో ఉంది.

కమలంతోనే పోటీ..

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రధాన పోటీ బీజేపీతోనే ఉంటుందనే నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చింది. ఎందుకంటే.. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో బీజేపీ ఎంపీలను గెలుచుకుంది. దీంతో ఆయా పార్లమెంటు స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ బలం పుంజుకుంది. బీఆర్ఎస్ చేపట్టిన పలు సర్వేల్లోనూ ఆయా జిల్లాల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని రిపోర్టులు వచ్చినట్టు చర్చ జరుగుతుంది. అయితే ఉమ్మడి కరీంనగర్ లోని నాలుగైదు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ తో పోటీ ఉంటుందని తేలినట్టు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల లీడర్లకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించినట్టు తెలిసింది.

అక్కడ 4 స్థానాలు కష్టమే?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 4 స్థానాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్‌లు గెలవడం కష్టమనే అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థుల కోసం పార్టీ పెద్దలు అన్వేషణ మొదలుపెట్టారు. అయితే ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈసారి ఎన్ని ఎత్తులు వేసినా గెలవడం కష్టమనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టు తెలుస్తున్నది. అందుకని ఆ స్థానంలో పార్టీ గెలుపుకోసం ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. కేబినెట్ హోదాలో ఉన్న ఓ ఎమ్మెల్యే పనితీరుపై లోకల్ గా తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఆయన్ను తప్పించి ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఆరా తీస్తున్నారు.

ఆ రెండు జిల్లాల్లో సిట్టింగ్‌లు అవుట్?

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పలువురు సిట్టింగ్ లను తప్పించాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు ప్రచారంలో ఉంది. పలు రిజర్వ్ డ్ స్థానాల్లోని ఎమ్మెల్యేల పనితీరు కారణంగా నియోజకవర్గాల్లో పార్టీకి ఇబ్బందులు వచ్చాయనే కోపంతో అధిష్టానం ఉంది. ఆయా స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దింపాలని భావిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఓ జనరల్ సీటును మార్చి, అక్కడ్నించి వెలమ సామాజిక వర్గానికి చెందిన లీడర్ కు టికెట్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పలువురు సిట్టింగ్ లకు అసెంబ్లీకి కాకుండా ఎంపీగా పోటీ చేయించే యోచనలో ఉన్నట్టు సమాచారం.

Read more:

వేర్ ఈజ్ ఎమ్మెల్సీ కవిత.. నెలన్నరగా నో అడ్రస్!

Focus: ఆ జిల్లాకు సీఎం కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారి పర్యటన

Advertisement

Next Story