2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది: కేసీఆర్

by GSrikanth |   ( Updated:2022-08-29 13:20:39.0  )
2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది: కేసీఆర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. గోల్‌మాల్ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆగ్రహం అయ్యారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని ప్రస్తుతం దేశం మొత్తం రాష్ట్ర ప్రగతిని చూస్తోందని అన్నారు. ఇటీవల తనను 26 రాష్ట్రాల నుండి రైతు సంఘాల నాయకులు వచ్చి కలిశారని తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను చూసి తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని గుజరాత్ మోడల్ పేరు చెప్పి దేశాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మ గాంధీ పుట్టిన రాష్ట్రం, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్‌లో కల్తీ మద్యం ఏరులైపారుతుందన్నారు. దీనికి మోడీ సమాధానం ఏంటో చెప్పాలన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న ఏ ఒక్క స్కీమ్ కూడా గుజరాత్‌లో అమలు కావడం లేదని కేవలం అవినీతి తప్పా అక్కడ ఏమీ లేదని అన్నారు. గజదొంగలు, లంచగొండులు ఇక్కడికి వచ్చి మత విద్వేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలోనూ ఉన్నారని జరుగుతున్న దాన్ని ప్రజలు గమనించాలని చెప్పారు. మోసపోతే గోసపడతామని చెప్పారు. 60 ఏళ్లు పోరాడి సాధించుకున్న రాష్ట్రం తిరిగి ఢిల్లీ నాయకులకు గులాం గిరి చేద్దామా? అని ప్రశ్నించారు. తెలంగాణ బాగుపడే సమయంలో లక్షల కోట్లు దోచుకున్న గజదొంగలు వస్తున్నారనని.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో స్వచ్ఛమైన నీళ్లు పారాలా? లేక మతకలహాల మంటలు చెలరేగి నెత్తురు పారాలా? అని ప్రశ్నించారు. నెత్తురు పారించమనే పిశాచులు, ప్రజల మధ్య విద్వేశాలను రెచ్చగొట్టే వారికి ప్రతి జిల్లాల్లో చైతన్యవంతం అయి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెత్తురు పారిస్తామంటున్న పిశాచులకు తగిన బుద్ధిచెప్పాలన్నారు.

2024లో బీజేపీ ముక్త్ భారత్:

దేశంలో మొత్తం వ్యవసాయానికి వాడే కరెంట్ కేవలం 20.8 శాతం మాత్రమేనని ఇందుకు అయ్యే ఖర్చు రూ.1 లక్ష 45 కోట్లు మాత్రమేనని అన్నారు. ఇది ఒక కార్పొరేట్‌కు దోచిపెట్టినంత విలువ కాదుగదా అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. వ్యవసాయం కోసం తమకు మీటర్లు లేని కరెంట్ కావాలని రైతు సంఘాల నేతలు తనను కోరారని రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకే మీటర్ పెట్టాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్క రంగంలో దేశాన్ని బాగుచేయకపోగా అన్ని రంగాల్లో అవినీతి పెచ్చరిల్లుతోందన్నారు. 12 లక్షల కోట్ల రూపాయలు ఎన్పీఏల పేరుతో ప్రధాని తన స్నేహితులకు దోచిపెట్టారని అదే లక్ష 45 వేల కోట్లు రైతులకు ఇవ్వడానికి చేతులురావడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో గోధుమలు, బియ్యం దిగుమతి చేసుకునే పరిస్థితికి దేశం వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో ధాన్యం కొనమంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చేతకాదని దుయ్యబట్టారు. పిచ్చి పిచ్చి విధానాలతో రూపాయి విలువ పతనం చేశారని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చారని అన్నారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే మీటర్లు పెట్టాలని అంటున్నారని, పెన్షన్‌లు ఇస్తే ఉచితాలు అంటున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోలి రైతు ప్రభుత్వం రాబోతుందని అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ శ్రీలంకలో తన స్నేహితులు, సావుకార్లకు బిజినెస్ ఇప్పిస్తే మొదటి సారి ఇండియన్ పీఎం గో బ్యాక్ అని నినాదాలు చేశారని ఇదేనా దేశ ప్రతిష్టను పెంచేదని, ఇదేనా విశ్వగురు అని చెప్పేదని ఫైర్ అయ్యారు.

పెద్దపల్లి జిల్లాపై వరాల జల్లు:

మోడీ హయంలో దోపిడీ తప్పా మరేమీ లేదని, తెలంగాణ ప్రజలు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బుద్ధిజీవులు, మేధావులు, రచయితలు, కళాకారులు, విద్యార్థులు మరోసారి చైతన్యం కావాలని మతపిచ్చిగాళ్లు, దుర్మార్గుల పట్ల ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. రామగుండంలో మెడికల్ కాలేజ్, మిషన్ భగీరథ వంటి పథకాలు వస్తాయని ఎప్పుడైనా కలలు కన్నామా? అని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, రామగుండం కార్పొరేషన్‌కు రూ.కోటి, జిల్లాలోని మిగతా మూడు మున్సిపాలిటీకి రూ.కోటి చొప్పున కేటాయిస్తున్నామన్నారు. తక్షణమే ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు.

KCR సభలో కలకలం.. నిరుద్యోగి ఆత్మహత్యా యత్నం

Advertisement

Next Story