నా లక్ష్యం అదే.. మహబూబ్‌నగర్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2022-12-04 14:47:00.0  )
నా లక్ష్యం అదే.. మహబూబ్‌నగర్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాలమూరు వలసల జిల్లా అని, కానీ, ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయి వలసలు వెళ్లిన వాళ్లు వాపస్ వస్తున్నారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని చెరువులన్నీ నింపి రైతులను రాజులను చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పాలమూరు పచ్చటి పంట పొలాలు, నిండుకుండలాంటి చెరువులతో కలకళలాడుతోందని వ్యాఖ్యానించారు. 25 లక్షల ఎకరాల్లో పాలమూరులో పచ్చని పంటలు పండేరోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేసి చూపిస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దళితబంధు, రైతుబంధు, గిరిజన బంధులతో అందరినీ అభివృద్ధి చేసే విధంగా టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోందని వెల్లడించారు.

తెలంగాణ రైతులను దేశంలోనే నెంబర్ వన్ చేయాలన్నదే తన లక్ష్యమని అభిప్రాయపడ్డారు. అయినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇవేమీ కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ మీద విషం కక్కడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో దేశానికి బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం పనితీరు 'పైన పటారం, లోన లోటారం' లాగా ఉందని సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా కేంద్రం పనిచేస్తేనే దేశం బాగుపడుతుందని అన్నారు. తెలంగాణకు నిధులివ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ వైఖరి మూలంగా తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల నష్టం జరిగిందని అన్నారు. కేంద్రం అభివృద్ధి చేయదు.. తమను చేయనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ప్రజలు తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని గుర్తుచేశారు. ఈ విషయాలన్నిటిపైనా యువకులు, మేధావులు చర్చ చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story