- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజకీయాల్లో ఒంటరైన కేసీఆర్.. ఒక్కొక్కరుగా దూరం పెడుతున్న అన్ని పార్టీల నేతలు!
ప్రస్తుత రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరయ్యారా?.. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఆయనను పక్కన పెట్టాయా?.. దేశంలోని ప్రాంతీయ పార్టీ నేతలతో సంబంధాలు బెడిసికొట్టాయా?.. కేసీఆర్‌ను కలుపుకుపోడానికి వారు సిద్ధంగా లేరా?.. ఆయనను కాంగ్రెస్ కూడా నమ్మడంలేదా?.. అన్ని పార్టీలకూ దూరమైన ఆయనకు ఇక మిగిలించి కేజ్రీవాల్ ఒక్కరేనా?.. వీరి స్నేహం ఎంతకాలం కొనసాగుతుంది?.. ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు తెలంగాణ, ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశాలుగా మారాయి. తాజాగా నీతి అయోగ్ సమావేశానికి హాజరయ్యే విషయంలోనూ, పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని ప్రారంభించే అంశంలోనూ కాంగ్రెస్ సహా యూపీఏ భాగస్వామ్య పార్టీలు బీఆర్ఎస్‌ను కలుపుకోకపోవడం గమనార్హం. మరి కేసీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీకి వ్యతిరేకంగా దేశం మొత్తాన్ని ఏకం చేస్తానని గతంలో ప్రకటించిన కేసీఆర్.. ఆ మేరకు కొన్ని రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ అయ్యారు. దాదాపు ఏడాది పాటు ఫ్రంట్ పాలిటిక్స్ పేరుతో వరుస మీటింగుల్లో బిజీగా గడిపారు. డీఎంకే అధినేత స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయ్, కర్ణాటకలో జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, ఆయన తండ్రి శిబూ సోరేన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్.. ఇలా పదుల సంఖ్యలో సీనియర్ నేతలను కేసీఆర్ కలిశారు. బీజేపీకి వ్యతిరేకంగా 2024 పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు.
బీజేపీకి ‘బీ టీం’ అంటూ ముద్ర
ఆయన కలిసినవారిలో ఎక్కువ మంది యూపీఏ భాగస్వామ్య పార్టీల అధినేతలే కావడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని చీల్చడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఎదురయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలను టచ్ చేయకపోవడంతో కేసీఆర్‌పై మరో రకమైన ముద్ర పడింది. బీజేపీకి ‘బీ టీమ్’ అనే నిందనూ ఆయన ఎదుర్కొన్నారు. పార్టీలను ఏకం చేసే సంగతి ఎలా ఉన్నా చివరకు కేసీఆర్ ఒంటరి అయిపోయారు. తాజాగా ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జేడీఎస్ (కుమారస్వామి)కి మద్దతు ఇస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించినా ప్రచారానికి వెళ్లకుండా దూరంగానే ఉండిపోయింది.
తెరపైకి నితీశ్
ఇదే టైంలో నితీశ్ కుమార్ చొరవ తీసుకుని బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేసీఆర్ గతేడాది తలపెట్టిన యాక్టివిటీని మరో రూపంలో నితీశ్ కుమార్ భుజాన వేసుకున్నారు. అందులో భాగంగా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రాల పర్యటనను ముమ్మరం చేశారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాత్రం భేటీ కాలేదు. అలాంటి ఆలోచన కూడా లేదంటూ బిహార్ నుంచి అందుతున్న సమాచారం. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌ను కలుపుకోడానికి ఏ ప్రాంతీయ పార్టీ నేత కూడా సిద్ధం కావడంలేదు. బీఆర్ఎస్ తాత్కాలిక ఆఫీస్ ప్రారంభోత్సవానికి హాజరైన అఖిలేశ్, తమిళనాడుకు చెందిన తిరుమావలవన్, కుమారస్వామి సైతం ప్రస్తుతం ఆయనతో కలవడంలేదు. చివరకు స్వయంగా పాట్నా వెళ్లి నితీశ్‌తో భేటీ అయ్యి ప్రత్యామ్నాయ పాలిటిక్స్ గురించి చర్చించినా ఆయన కూడా కేసీఆర్‌ను దూరంగానే ఉంచారు.
కేవలం కేజ్రీవాల్‌తో మాత్రమే తెలంగాణ సీఎం స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక్కడి గవర్నర్‌తోనూ కేసీఆర్ అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. వీరిద్దరికీ గవర్నర్లతో పేచీలు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇద్దరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా చిక్కుల్లో పడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతోనూ ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సు వీరిద్దరినీ ఒక రూపంలో మరింత దగ్గర చేసింది. కేజ్రీవాల్‌కు సైతం కాంగ్రెస్‌తో ఫ్రెండ్లీ రిలేషన్స్ లేవు. ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా జరిగే పోరుకు మద్దతుపై మల్లికార్జన్ ఖర్గే, రాహుల్‌గాంధీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగినా వారి నుంచి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
బీఆర్ఎస్, ఆప్ స్నేహం ఎంత వరకు లాభం?
తాజాగా నీతి అయోగ్ సమావేశానికి హాజరయ్యే విషయంలోనూ, పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని ప్రారంభించే అంశంలోనూ కాంగ్రెస్ సహా యూపీఏ భాగస్వామ్య పార్టీలు బీఆర్ఎస్‌ను కలుపుకోలేదు. జాయింట్ స్టేట్‌మెంట్ కోసం ప్రయత్నాలూ చేయలేదు. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు చెందకుండా కేసీఆర్ ఏకాకిగా మిగిలిపోయారు. కేసీఆర్, కేజ్రీవాల్ ‘విశ్వసనీయ మిత్రులు కారు’ అనే అభిప్రాయంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఉన్నాయి. వివిధ సందర్భాల్లో ఆ పార్టీల నేతలు ఈ అర్థంలోనే కామెంట్స్ చేశారు. వీరిద్దరి మధ్య స్నేహం పరస్పర రాజకీయ ప్రయోజనాలకు ఏ మేరకు దోహదపడుతుంది?.. ఇప్పటికే జాతీయ గుర్తింపు పొందిన ఆప్ స్నేహంతో బీఆర్ఎస్‌కు కలిసొచ్చేదేమిటి?.. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్నా ఆ రెండు పార్టీలకు జరిగే మేలు ఏంటి?.. ఇవీ ఇప్పుడు తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చలు. జాతీయ పార్టీగా అవతరించిన ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపగలుగుతుంది. కానీ బీఆర్ఎస్‌కు అలాంటి బలం లేనప్పుడు కేసీఆర్‌తో కేజ్రీవాల్ ఎందుకు దోస్తానా కంటిన్యూ చేస్తున్నారనేది ఆసక్తికర చర్చ.