అతి విశ్వాసమా.. అనివార్యమా?

by Vinod kumar |   ( Updated:2023-08-23 23:31:03.0  )
అతి విశ్వాసమా.. అనివార్యమా?
X

అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు. నాలుగు నెలల ముందే రిలీజ్ చేసిన జాబితాలో ఏడుగురు మినహా దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు దక్కాయి. పలువురిపై ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత వేర్వేరు స్థాయిల్లో ఉన్నా, సర్వే రిపోర్టుల్లో నెగెటివ్ కనిపించినా కేసీఆర్ మళ్ళీ వారికే టికెట్లు ఇచ్చారు. సొంత పార్టీ నేతలకే ఇది మింగుడు పడలేదు. మళ్ళీ గెలుస్తారన్న అతి విశ్వాసమా లేక వారిని మారిస్తే అసలుకే మోసం వస్తుందనే భయమా, అందుకే సిట్టింగ్‌లకే మళ్ళీ ఇవ్వకతప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందా.. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చ.

దళితబంధు స్కీమ్‌లో కొంతమంది ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే గతంలో ఆరోపించారు. అందులో ఇప్పుడు టికెట్లు పొందినవారూ ఉన్నారు. అయినా తిరిగి వారికే పోటీచేసే అవకాశం కల్పించారు. అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూనే వారినే ఎందుకు ఎంపిక చేసినట్లు వారు అవినీతి చర్యలకు పాల్పడలేదని చెప్పడమా? ఒకవేళ వారిని మారిస్తే అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లవుతుందనా? అది విపక్షాలకు అస్త్రంగా ఉపయోగపడుతుందనే అనుమానమా? ఒకవేళ వారిని పక్కన పెడితే ఆ నియోజకవర్గంలో దీటైన అభ్యర్థి దొరకకపోవడమా... ఇలాంటి అనేక వాదనలు వినిపిస్తున్నాయి.

వ్యూహాత్మక ఎత్తుగడ..

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టడం కేసీఆర్ రాజకీయ వ్యూహం. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి విపక్షాలను తన ఉచ్చులోకి లాగారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించే అవకాశం లేకుండా చేశారు. అనివార్యంగా ఆ పార్టీలు కూడా అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఇకపైన బీఆర్ఎస్ అభ్యర్థికి దీటైన వ్యక్తి కోసమే వారు ఫుల్ టైమ్ కేటాయించే పరిస్థితిలోకి నెట్టారు. బీఆర్ఎస్‌ను విమర్శించడానికి తగిన స్కోప్ లేకుండా చేయగలిగారు. కాంగ్రెస్, బీజేపీలు క్యాండిడేట్లను ప్రకటించేలోపే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల సగం క్యాంపెయిన్ కంప్లీట్ అయిపోతుంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వివిధ స్థాయిల్లో అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నదనేది నిర్వివాదాంశం. పల్లెల్లో వివిధ పనుల మీద వెళ్ళినప్పుడు వారిని ఘెరావ్ చేయడమే ఇందుకు నిదర్శనం. వివిధ సమస్యలపై వారిని ప్రజలు ముఖంమీదనే నిలదీశారు. వెంటాడి వేటాడి తరిమేశారు. కేసీఆర్ చేయించుకున్న సర్వేల్లో, ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇన్‌పుట్స్ లో కూడా ఇది వచ్చిందని ఆ పార్టీ నేతలే చెప్పుకున్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ కారణంగానే చివరి నిమిషం వరకూ టికెట్ వస్తుందో రాదోనని టెన్షన్ పడ్డారు.

రెబల్స్‌గా పోటీచేస్తారనే భయమూ!

ఇంతకాలం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అనే ధోరణి నెలకొన్నది. ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛ, అలుసుతో వారు చెప్పిందే వేదంగా నడిచింది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక మొదలు ఎస్ఐ, సీఐల బదిలీల వరకు వారి మాటే ఫైనల్. ప్రభుత్వ అధికారులు మొదలు ఐఏఎస్‌ల వరకు దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలూ ఉన్నారు. సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, లోకల్ ప్రజలపై విరుచుకుపడడం ఆడియో లీక్‌ల రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఇంత వివాదాస్పదంగా మారినా వారికే మళ్ళీ టికెట్లు ఇచ్చారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అతి విశ్వాసంతో కూడుకున్నదా.. లేక దుస్సాహసమా అనే చర్చ కూడా జరుగుతున్నది.

గత ఎన్నికల సందర్భంగా కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది.. అంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారు. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ ఇమేజ్‌తోనే గెలుస్తారన్నది ఆ పార్టీలో ఇప్పటికీ వినిపించే జనరల్ టాక్. ఇప్పుడు సిట్టింగ్‌లకు మళ్ళీ టికెట్ ఇవ్వడంతో తనను చూసే గెలిపిస్తారని కేసీఆర్ భావించారా లేక వారిని గెలిపించుకునే సత్తా ఉన్నదనే ధీమాతో ఉన్నారా లేక వారిని మారిస్తే రెబల్స్‌గా పోటీ చేస్తారని అనుకున్నారా లేక కొత్తవారిని తెరపైకి తెస్తే గెలిపించుకోవడం కష్టమని కాన్ఫిడెన్సును కోల్పోయారా, మూడోసారి పవర్‌లోకి రావాలనుకునే టైమ్‌లో ప్రయోగాలెందుకని భావించారా.. ఇలాంటి అనేక కారణాలు ఉండొచ్చు.

కేసీఆర్ వ్యూహం వెనక మతలబేంటి..

అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ వ్యూహమేంటి? సిట్టింగ్‌లకే మళ్లీ ఎందుకు చాన్స్ ఇచ్చారు? ఇవ్వకుంటే అసంతృప్తితో మరో పార్టీలోకి వెళ్ళిపోతారని ఊహించారా? ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున బ్యాలెన్సు చేయలేక ఇదే బెస్ట్ ఫార్ములా అనుకున్నారా? సొంత పార్టీ నేతల మధ్య పోటీ వస్తే చిక్కులు ఉంటాయన్న భావనతో పాతవారివైపే మొగ్గు చూపారా? అసలే గ్రూపులు, వర్గాలుగా విడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో కేడర్‌ను కంట్రోల్ చేయడం పార్టీ సీనియర్ నేతలకు సవాలే. గతంకంటే ఈసారి ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తామని కేసీఆర్ ధీమాగా చెప్తున్నా గ్రౌండ్ పరిస్థితిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.

ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం ఉండగానే, షెడ్యూలు విడుదల కాకముందే అభ్యర్థుల్ని ప్రకటించి విపక్షాల క్యాండిడేట్లకు ప్రచారం చేసుకోడానికి తగినంత టైమ్ ఇవ్వకుండా చేశారు. ఆ పార్టీలు ఫీల్డ్ మీదకు వచ్చేలోపే ఓటర్ల మైండ్‌ను సెట్ చేసేసుకునే బీఆర్ఎస్ అభ్యర్థులకు వెసులుబాటు చిక్కింది. మరోవైపు షెడ్యూలు వచ్చే లోపునే చేతివృత్తులకు చేయూత, గృహలక్ష్మి, మైనారిటీలకు లక్ష సాయం, రుణమాఫీ సంబురాలు, ఇంకేమైనా కొత్త స్కీమ్‌లను కేసీఆర్ ప్రకటిస్తే వాటిని గ్రౌండింగ్ చేయడం.. ఈ మైలేజ్ పొందడం కేసీఆర్ ప్లాన్‌లో భాగం. స్కీమ్‌ల అమలు ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఓరల్ టాక్‌తో పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవడం కేసీఆర్ వ్యూహం కాబోలు!

అసలైన సవాళ్ళు ఇకపైనే..

ఇల్లలకగానే పండగ కాదనే తీరులో అభ్యర్థుల్ని ప్రకటించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. కానీ అసలు సవాళ్ళు ఇప్పుడే మొదలు కానున్నాయి. టికెట్ దక్కని పలువురు సిట్టింగ్‌లతో పాటు ఆశావహులు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పుడు అవకాశం దక్కనివారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చినా ఆగడంలేదు. కొద్దిమంది ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇంకొంతమంది ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. సిట్టింగ్‌ల పట్ల నియోజకవర్గ ప్రజల్లోనే కాక సొంత పార్టీ కేడర్‌లోనూ అసంతృప్తి తీవ్రంగానే ఉన్నది. అయినా వారికే టికెట్లు రావడంతో అసంతృప్తి శ్రేణుల్ని దారిలోకి తెచ్చుకోవడం ఇప్పుడు అభ్యర్థులకు ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది.

కోర్టుల్లో ఎన్నికల వివాదం కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకూ చాన్స్ దక్కింది. వారిపై ఎలాంటి తీర్పులు వస్తాయనేదానితో సంబంధమే లేకుండా కేసీఆర్ వారినే అభ్యర్థులుగా ప్రకటించేశారు. అసంతృప్తిలో ఉన్న కేడర్‌తో పాటు టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన ఆశావహులు ఇప్పుడు ఆ అభ్యర్థులకు సహకారాన్ని ఏ మేరకు అందించి గెలిపిస్తారన్నది కీలకంగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో తెలంగాణలో ఆ పార్టీతో గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి వస్తున్నది. వంద జాకీలు పెట్టి లేపినా లేవదని నిందించిన గులాబీ నేతలే ఇప్పుడు ఆ పార్టీని బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీలు.. ఒకదానికి మరొకటి ‘బీ-టీమ్’ అనే ఆరోపణల్లో నిజానిజాల సంగతెలా ఉన్నా ఇంతకాలం ఉన్న ముక్కోణపు పోటీ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది.

ఎన్. విశ్వనాథ్

99714 82403



Advertisement

Next Story

Most Viewed