IRCTC: రైల్వే ప్రయాణికులకు షాక్.. అడ్వాన్స్ బుకింగ్ సమయం కుదింపు

by Y.Nagarani |   ( Updated:2024-10-17 09:27:34.0  )
IRCTC: రైల్వే ప్రయాణికులకు షాక్.. అడ్వాన్స్ బుకింగ్ సమయం కుదింపు
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే.. ప్రయాణికులకు షాకిచ్చింది. అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని (train advance reservation period) 120 రోజుల నుంచి 60 రోజులకు కుదించింది. ఈ నిబంధన నవంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటికే 120 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నవారికి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేసింది. ఇకపై రెండు నెలల వరకూ అందుబాటులో ఉన్న టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. 120 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అక్టోబర్ 31 వరకూ ఉంటుందని.. రైల్వేశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

60 రోజుల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే పద్ధతి అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు టికెట్ల రిజర్వేషన్ కష్టాలు తగ్గుతాయని రైల్వే శాఖ భావిస్తోంది. ఎమర్జెన్సీ టికెట్స్, నెలరోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకునేవారికి ఈ మార్పుతో కాస్త ఊరట కలగనుంది. టికెట్ బుకింగ్ సమయాన్ని 60 రోజులకు కుదించడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించడం ద్వారా సాధారణ ప్రజలకు అడ్వాన్స్ బుకింగ్ ను మరింత అందుబాటులోకి తీసుకురావొచ్చని రైల్వేశాఖ అభిప్రాయపడింది.

అయితే.. రాజధాని ఎక్స్ ప్రెస్(Rajadhani Express) , గతిమాన్ ఎక్స్ ప్రెస్ (Gatiman Express) వంటి రైళ్ల బుకింగ్ కు ఈ నియమం వర్తించదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఆయా రైళ్ల బుకింగ్స్ లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. విదేశీ పర్యాటకుల కోసం 365 రోజుల పాటు బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఉంటాయని చెప్పింది.

Advertisement

Next Story