జనాభా లెక్కల ఆలస్యంపై కాంగ్రెస్ ఫైర్

by John Kora |
జనాభా లెక్కల ఆలస్యంపై కాంగ్రెస్ ఫైర్
X

- 2011 తర్వాత 25 శాతం పెరిగిన జనాభా

- మరో 15 కోట్ల మందికి జాతీయ ఆహార భద్రతా కార్డులు వచ్చే అవకాశం

- జనాభా లెక్కలపై ఎలాంటి హామీ ఎందుకు ఇవ్వడం లేదు

- రాజ్యసభలో అజయ్ మాకెన్ విమర్శలు

దిశ, నేషనల్ బ్యూరో: జన గణన నిర్వహించడంలో జాప్యంపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయ్యింది. సెన్సెస్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ప్రభుత్వం ఉపయోగించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ దుయ్యబట్టారు. శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పని తీరుపై జరిగిన చర్చలో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. 2011లో చివరి సారిగా జనాభా లెక్కలు తీసిన తర్వాత.. దేశంలో 25 శాతం మేర జనాభా పెరిగిందని ఆయన చెప్పారు. 2011లో 121 కోట్ల జనాభా ఉండగా.. ఇప్పుడు అది 146 కోట్ల వరకు చేరుకున్నట్లు ఆయన అంచనా వేశారు. 2011 జనాభా లెక్కల కోసం అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2009 నుంచే షెడ్యూల్ చేసిందని గుర్తు చేవారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ జనాభా లెక్కలైనే ఆధారపడి ఉన్నందున. ఈ సెన్సెస్ మాకు చాలా ముఖ్యమైనదని అజయ్ మాకెన్ పేర్కొన్నారు.

గ్రామీణ జనాభాలోని 70 శాతం మందికి, అర్బన్ జనాభాలోని 50 శాతం మందికి వర్తించే జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా అనేక మంది లబ్దిపొందుతున్నారని అన్నారు. తాజా లెక్కలు తీస్తే మరో 15 కోట్ల మంది ఈ చట్టం కింద ప్రయోజనాలను అందుకుంటారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు జనగణన పూర్తి చేయనందు వల్ల ఆ 15 కోట్ల మంది తమ ప్రయోజనాలను కోల్పోతున్నారని చెప్పారు. సెన్సెస్ ఆలస్యం కావడం వల్ల జాతీయ నమూనా సర్వే కార్యాలయం నిర్వహించే ఇతర సర్వేలకు కూడా ఆటంకం కలుగుతుందని విమర్శించారు.

కోవిడ్ పాండమిక్ కారణంగా జనాభా లెక్కలకు అంతరాయం కలిగిందన్న విషయాన్ని అంగీకరిస్తున్నాము. అయితే ఆ తర్వాత సంవత్సరాల్లో కేటాయించిన నిధులను ప్రభుత్వం ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. జనాభా లెక్కల కోసం కేటాయించిన నిధులలో 2022లో 60 శాతం, 2023లో 85 శాతం, 2024లో 58 శాతం ఖర్చు చేశారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జనగణనను వీలైనంత త్వరగా నిర్వహిస్తామని ఎందుకు హామీ ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Next Story