సంచలన ఘటనలపై స్పందించని సీఎం.. ఏం చేస్తున్నాడో తెలుసా?

by GSrikanth |   ( Updated:2023-02-25 23:30:28.0  )
సంచలన ఘటనలపై స్పందించని సీఎం.. ఏం చేస్తున్నాడో తెలుసా?
X

హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు చిన్న పిల్లాడిని కరిచి చంపేశాయి.. ర్యాగింగ్ తో ఓ మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యకు యత్నించింది.. పోలీసుల దెబ్బలకు ఓ అమాయకుడు బలయ్యాడు. దళిత ఎమ్మెల్యే అంత్యక్రియల వ్యవహారం వివాదాస్పదమైంది. స్టేట్ లో జరుగుతున్న ఇలాంటి వరుస ఘటనలు రాష్ట్రానికి చెడ్డ పేరును తీసుకువస్తున్నాయి. ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకొని.. రివ్యూ నిర్వహించాల్సిన సీఎం సైలెంట్ గా ఉండిపోతున్నారనే విమర్శలున్నాయి. పాలనా వ్యవహారాలపై దృష్టి సారించకుండా.. బీఆర్ఎస్ విస్తరణపైనే ఇంట్రస్ట్ చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ లో కూతురు కవితను అరెస్ట్ చేస్తే నెక్ట్స్ ఏం చేయాలనే దానిపైనే పార్టీ లీడర్స్ తో సమాలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: వారం రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక చోట వివాదాలు, విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వాటి పట్ల ప్రభుత్వం సరిగా స్పందించడం లేదనే విమర్శలున్నాయి. సంబంధిత శాఖల మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన మినిస్టర్లు విచారం వ్యక్తం చేస్తూ ప్రకటనలకే పరిమితమవుతున్నారు. సమస్యలేమిటి? ఘటనలకు కారణాలేమిటి? మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? అనే విషయాలపై దృష్టి పెట్టాల్సిన సీఎం కేసీఆర్ మౌనంగా ఉంటుంటడంపై విమర్శలు వస్తున్నాయి.

జాతీయ స్థాయిలో పరువు పోయినా..

హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ అని ప్రభుత్వం పదేపదే గొప్పలు చెప్పుకుంటుంటుంది. అలాంటి నగరంలోని అంబర్ పేటలో ఓ బాలుడు వీధికుక్కల దాడిలో మృతి చెందాడు. దీనిపై మున్సిపల్ శాఖ మంత్రి విచారం వ్యక్తం చేయడానికే పరిమితమయ్యారు. ఆకలికి తట్టుకోలేక కుక్కలు దాడి చేశాయని హైదరాబాద్ మేయర్ కామెంట్ చేశారు. దీనిపై జాతీయ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నెటీజన్లు పోస్టింగులు పెట్టారు. కానీ ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రివ్యూ చేయలేదు. కనీసం స్పందించలేదు.

లాకప్ డెత్ పై మౌనం

దొంగతనం కేసులో పాతబస్తీకి చెందిన ఖదీర్ ఖాన్ ను మెదక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణంచాడు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. చివరికి హైకోర్టు కూడా కేసును సుమోటోగా తీసుకున్నది. ‘ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్’ అని విపక్షాలు ప్రశ్నించాయి. అయినా సీఎం మౌనం వీడలేదు.

ప్రీతి ఇన్సిడెంట్ పై నో కామెంట్

సీనియర్ల వేధింపులు తట్టుకోలేక కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. నిమ్స్ లో చికిత్స పొందుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. స్పందించిన గవర్నర్ ఆస్పత్రికి వెళ్లి సరైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిపై కూడా సీఎం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించి, చర్యలకు ఎందుకు ఆదేశించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సాయన్న వివాదంపై సైలెంట్

ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అస్వస్థతతో కన్నుమూశారు. ఆయన ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఫ్యామిలీ మెంబర్లను ఓదార్చారు. కానీ మరుసటి రోజు సాయన్న అంత్యక్రియల విషయంలో వివాదం మొదలైంది. అధికారిక లాంఛనాలతో ఎందుకు అత్యక్రియలు నిర్వహించడం లేదని అనుచరులు ఆందోళన చేశారు. దళితుడైనందుకే వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలోనూ పార్టీ అధినేత నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

బీఆర్ఎస్ విస్తరణపైనే ఇంట్రస్ట్

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ కొండగట్టు అంజన్న దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆయన పెద్దగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ రెండు రోజుల క్రితం ప్రగతిభవన్ లో క్లోజ్ లీడర్లతో ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించినట్టు తెలిసింది. మంత్రి హరీశ్ రావు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ వినోద్, ఎంపీ దామోదర్ రావు పాల్గొన్న ఈ సమావేశం రాత్రి పొద్దుపోయేవరకు జరిగినట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం చేయాల్సిన కార్యచరణపై ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది.

కవితను అరెస్ట్ చేస్తే..

ఇటీవల ప్రగతిభవన్ లో ప్రత్యేకంగా జరిగిన మీటింగ్ లో ఢిల్లీ లిక్కర్ కేసు పురోగతిపై సీఎం ఆరా తీసినట్టు సమాచారం. ఈ కేసులో సీబీఐ, ఈడీ ఢిల్లీలోని స్పెషల్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లలో ప్రస్తావించిన వారిలో మెజార్టీ వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేసింది. త్వరలో ఎమ్మెల్సీ కవితను కూడా అదుపులోకి తీసుకునే చాన్స్ ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే, ఏం చేయాలి? రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి? న్యాయపరంగా ఏ స్టెప్ తీసుకోవాలి? అనే అంశాలు ఆ మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చినట్టు పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed