సరిహద్దు రాష్ట్రాలపై గట్టి నిఘా : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by M.Rajitha |
సరిహద్దు రాష్ట్రాలపై గట్టి నిఘా : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : సరిహద్దు రాష్ట్రాలపై గట్టి నిఘా పెట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం దిగుమతి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పకడ్భందీగా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత అధికారులదేనని నొక్కి చెప్పారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో 2023-24 ఖరీఫ్ పంట కొనుగోలుపై రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా స్థాయి పౌర సరఫరాల శాఖా మేనేజర్లతో మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు వేరు వేరుగా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు. ఖరీఫ్ లో 60 లక్షల 39 వేల ఎకరాల్లో ధాన్యం సాగు జరిగిందన్నారు. 146 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశామన్నారు. 91 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. మొట్టమొదటి సారిగా 40 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోడౌన్ ల ఏర్పాటు చేశామన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

ప్రభుత్వం ఆశించిన మేరకు సన్నాల దిగుబడి ఉన్నదని, 36 లక్షల 80 వేల ఎకరాల్లో సన్నాలు సాగు అవుతున్నాయన్నారు. 88 లక్షల 9 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేశామన్నారు. ఖరీఫ్ నుండి సన్నాలకు 500 బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం విప్లవాత్మకమైనదని, సరిహద్దు రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ధాన్యం కొనుగోలులో అధికారులదే కీలక పాత్ర అని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్ లో సేకరించిన సన్నాలతో జనవరి నుండి చౌక ధరల దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయంలో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకూడదని స్పష్టం చేశారు. ప్రజల సొమ్ముతో అప్పు చేసి కొనుగోలు చేస్తున్న ధాన్యం అంశంలో ఎలాంటి నిర్లక్ష్యం జగరగవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ చవాన్, జాయింట్ సెక్రటరీ ప్రియాంక అలా, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ లక్ష్మి, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed