- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ జిల్లాలో కమల సారథులు ఎవరో..?

దిశ, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జిల్లా కమలనాధుల సారధి ఎంపికలో భారీ జాబితానే కనిపిస్తోంది. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళతో పాటుగా నూతనంగా అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ఊరిస్తున్న అధ్యక్ష పదవిని వెంటనే భర్తీ చేయాలని జిల్లాల నేతలు అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇంకెంతకాలం తమని ఎదురుచూడబెడతారని ఒకింత అసహనానికి కూడా నేతలు గురవుతున్నట్లు సమాచారం. ఇదిలా రాష్ట్రస్థాయి నేతలతో ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నారు. ఆ క్రమంలోనే అధిష్టానం ఆశీస్సులు తమకంటే తమకు అని ఎవరికి వాళ్లు బలంగా భావిస్తున్నారు. అంతే కాకుండా గతంలో పనిచేసిన అధ్యక్షుల పనితీరు పై అసంతృప్తి ఉన్న నాయకులు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది.
సారధి కోసం భారీ జాబితానే..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు నూతన బీజేపీ అధ్యక్షులను నియమించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడు జిల్లాలకు పెద్ద సంఖ్యలోని నేతలు పోటీపడుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన నాగం వర్షిత్ రెడ్డి, మాధగోని శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన పోతే పాక సాంబయ్య, దేవరకొండ నుంచి లంబాడా సామాజిక వర్గానికి చెందిన లాలూ నాయక్, చౌటుప్పల్ నుంచి కుంచం రమేష్, దోనూరి వీరారెడ్డి, సాధినేని శ్రీనివాసరావు ఉన్నట్లు సమాచారం. అయితే నాగం వర్షిత్ రెడ్డిని ఈ దఫా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించకూడదని గత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేగాకుండా పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
దీంతో వర్షిత్ రెడ్డికి కాకుండా తమలో ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చిన ఎలాంటి అభ్యంతరం లేదని కూడా స్పష్టంగా అధిష్టానం ముందు చెప్పినట్లు వినికిడి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ తో పాటు భువనగిరి పట్టణానికి చెందిన పడమటి జగన్మోహన్ రెడ్డి ఆలేరుకు చెందిన పాడాల శ్రీనివాస్, రాజపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్లు సమాచారం. అయితే వయసు రిత్యా పాశం భాస్కర్ కు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పడమటి జగన్మోహన్ రెడ్డి విద్యార్థి సంఘం నుంచి నేటి వరకు పార్టీలో పని చేస్తూ మున్సిపల్ కౌన్సిలర్ చాలా కాలంగా పనిచేస్తూ పార్టీ పై మంచి అవగాహన కలిగి ఉన్నారు. దాంతో పాటు రాష్ట్ర స్థాయిలో బలమైన నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి.
రాజశేఖర్ రెడ్డి యూకేలో ఆర్ఎస్ఎస్ లో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేసారని, ఈ నేపథ్యంతోనే యాదాద్రి జిల్లా అధ్యక్ష పదవికి సీరియస్ గా పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇక ఆలేరుకు చెందిన పాడాల శ్రీనివాస్ అధ్యక్ష పదవి కోసం తన ప్రయత్నాలను సీరియస్ గా కొనసాగిస్తున్నట్లు వినికిడి. సూర్యాపేట జిల్లా నుంచి ప్రధానంగా ముగ్గురు నేతలు జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అందులో మాజీ అధ్యక్షులు భాగ్యరెడ్డి మరోసారి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు తనకు మరోసారి అవకాశం కోరుతున్నారు. అంతే కాకుండా పార్టీ సీనియర్ నేత సంకినేని వెంకటేశ్వరరావు తనయుడు సంకినేని వరుణ్ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న క్రమంలో జిల్లా అధ్యక్షులు పదవి కోసం అవసరమైనంత వయస్సు లేకపోవడంతో లెక్కలోకి తీసుకోవట్లేదని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక గతంలో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీలత రెడ్డి అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. ఈమె సోదరుడు రాష్ట్ర బీజేపీ కార్యవర్గంలో కీలకంగా పనిచేస్తున్నారనే అందరికీ తెలిసింది. అందువల్లే ఆమె తన సోదరుడు ద్వారా అధ్యక్ష పదవి కోసం పార్టీ అధిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.
సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యత..
ప్రతి రాజకీయ పార్టీలో ఒకటి, రెండు సామాజిక వర్గాలకే పార్టీలో ప్రధాన పదవులు లభిస్తున్నాయని చాలాకాలంగా జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఆ అపవాది నుంచి బయటపడేందుకు అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈసారి బీజేపీ పార్టీ కూడా జిల్లా అధ్యక్షుడు ఎంపిక చేసే క్రమంలో మూడు జిల్లాలకు మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలతో పాటుగా, మహిళలకు కూడా ప్రాధాన్యత అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆలోచన ఏ మేరకు అమలవుతుందో వేచి చూడాల్సిందే.
నేడు అధ్యక్షులను ప్రకటించే అవకాశం...?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం రోజున అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరించారు. నేడు జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే కచ్చితంగా ఏకాభిప్రాయంతోనే మూడు జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించాలనే బావనతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం అయితే ఇప్పటికే నల్లగొండ యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించిన జిల్లా సారధుల ఎంపికకు ఏకాభిప్రాయం కుదిరిందని, సూర్యాపేట జిల్లాకు కుదరలేదని సమాచారం. నేడు కూడా ఏకాభిప్రాయం కుదరకపోతే జిల్లా అధ్యక్షుడి ప్రకటన జరగదని అధిష్టానం పేర్కొన్నట్లు సమాచారం