ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం

by GSrikanth |   ( Updated:2024-01-06 12:24:11.0  )
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం అమలు, భూ రికార్డుల సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు సహా మరికొన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కలెక్టర్లతో రేవంత్ రెడ్డి సమావేశం కావాలని నిర్ణయించడం ఇదే మొదటిసారి. దీంతో కలెక్టర్లంతా పూర్తి అప్రమత్తంగా సమావేశానికి హాజరు కానున్నారు.

ఆరు గ్యారెంటీల అమలుపై నజర్:

అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తుండటంతో వివిధ శాఖలలోని వాస్తవ పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన రేవంత్ రెడ్డి ఇక హామీల అమలుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా అమలు పరచగా మిగతా హామీల దిశగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ధరణిని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యలో ఇటీవల ధరణి లోటుపాట్లపై అధికారులు, నిపుణులు, ఉద్యోగ సంఘాలతో సీఎం కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజావాణి వస్తున్న ఫిర్యాదుల్లో భూసమస్యలే అధికంగా ఉండటంతో జిల్లా స్థాయిలో పరిష్కారం కోసం సీఎం కలెక్టర్లకు ఏదైనా సూచనలు చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.

అలాగే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు జారీ జరగకపోవడంతో పెద్ద సంఖ్యలో కొత్తరేషన్ కార్డు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అర్హులైన వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇటీవలే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆలాగే రైతుబంధు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సమయం లేకపోవడంతో యాసంగికి పాతపద్దతిలోనే రైతుల ఖాతాలో నగదు జమ చేసిన ప్రభుత్వం ఆతర్వాత రాబోయే వర్షాకాలం వరకు విధివిధానాలు రూపొందించాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ విషయంలో కౌలు రైతులను గుర్తించడం ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద టాస్క్. ఈ అంశంపై కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisement

Next Story