CM Revanth Reddy: కాళ్లు, చేతులు విరిచినా బుద్ధిమారదా?.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

by Prasad Jukanti |
CM Revanth Reddy: కాళ్లు, చేతులు విరిచినా బుద్ధిమారదా?.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బడ్జెట్‌లో అప్పుల లెక్కలు చెబుతున్న హరీశ్‌రావు.. వారి హయాంలో అమ్ముకున్న లెక్కలు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలన నిజాయితీగా సాగి ఉంటే మీరు గొప్ప పథకాలు అని చెబుతున్న బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపకాలు పథకాలపై విచారణకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఇవాళ ఆయన సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అనేక పథకాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాళ్లు, చేతులు విరిచేసినా.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఉరితీసినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘సూరత్’ చీరలతో మభ్యపెట్టారు

సెంటిమెంట్‌తో కూడుకున్న బతుకమ్మ చీరల విషయంలో అవినీతికి పాల్పడ్డారని, చేనేతకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి సూరత్ వెళ్లి కిలోల లెక్కన చీరలు తీసుకువచ్చి ఆడబిడ్డలను మభ్యపెట్టారని గత బీఆర్ఎస్ సర్కార్‌పై ముఖ్యమంత్రి మండిపడ్డారు. లక్షల కోట్ల విలువైన అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తే దానిని పల్లీబఠాణి మాదిరిగా రూ.7 వేల కోట్లకు తెగనమ్మారని ఆరోపించారు. గొర్రెల పథకంలో భారీ స్కామ్ చేశారు.. ఈ స్కీమ్‌పై ఏసీబీ చేసిన దర్యాప్తులోనే రూ.700 కోట్లు స్వాహా చేసినట్లు రిపోర్టులు వచ్చాయి.. అని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిందే రూ.80 వేల కోట్లు అయితే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని నిన్నా మొన్నటి వరకు సవాల్ చేశారని, ఇప్పుడేమో రూ. 94 వేల కోట్లే ఖర్చు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

ఇంకా మిగిలే ఉందా అని మేడిగడ్డకు బీఆర్ఎస్

మేడిగడ్డ ఎలా కూలింది? ఇంకేమైనా మిగిలిందా? అని చూసేందుకు బీఆర్ఎస్ నేతలు నిన్న మేడిగడ్డకు వెళ్లారని సీఎం సెటైర్ వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు గడిచిన పదేళ్లలో ఎక్కువ అన్యాయం జరిగిందని, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, సంగంబండ, రాజోలి బండ, జూరాల ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ నేతల దుర్మార్గం కాదా..? అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో వేలకోట్ల రూపాయల భూములు అమ్మేశారని, ఆ జిల్లాకు కనీసం మౌలిక వసతులు కల్పించలేకపోయారని మండిపడ్డారు.

హరీశ్.. ఇదిగో సాక్ష్యం

హరీశ్‌రావు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ మీటర్ల విషయంలో తాము కేంద్రంతో పోరాటం చేశామని, రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకునే అవకాశం ఉన్నా తాము తిరస్కరించామని హరీశ్‌రావు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని తిప్పికొట్టారు. హరీశ్‌రావు చెప్పిన అబద్ధాలను రికార్డుల నుంచి తొలగించి సవరించాలని స్పీకర్‌ను కోరారు. గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బయట ఏదైనా మాట్లాడితే పర్వాలేదు.. కానీ సభలో కూడా అబద్ధాలతో ఇంకా బుకాయించాలనే చూడటం సబబు కాదన్నారు. 4 జనవరి 2017 ఆనాటి సీఎం కేసీఆర్ మీటర్లు బిగిస్తామని మోడీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story