TRS నేతల్లో కాన్ఫిడెన్స్ డౌన్.. స్వయంగా KCR మాటల్లోనే తేటతెల్లం?

by GSrikanth |   ( Updated:2022-09-05 05:40:45.0  )
TRS నేతల్లో కాన్ఫిడెన్స్ డౌన్.. స్వయంగా KCR మాటల్లోనే తేటతెల్లం?
X

తెలంగాణలో కారుకు బ్రేకులు పడుతున్నాయా..? వేర్వేరు సంస్థలతో సర్వే చేయించామని, ఇప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్ కు 95 నుంచి 105 సీట్లు పక్కా అంటూ ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. శనివారం రాత్రి నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో 72 నుంచి 80 సీట్లలో గెలుస్తామని వ్యాఖ్యానినంచారు. సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని, కొందరు పద్ధతి మార్చుకోవాలంటూ పరోక్షంగా చురకలంటించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రాభవం తగ్గిపోతున్నదా..? ఏయే స్థానాలను కోల్పోనుంది..? ఆ స్థానాలు ఎవరికి దక్కనున్నాయి.?

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమకే దక్కుతుందంటూ మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని, దక్షిణాదిలో హ్యాట్రిక్ కొట్టబోతున్న ఏకైక సీఎం ఆయనే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గోల్కొండ కోటపై జెండా ఎగురవేయబోతున్నామని, పవర్‌లోకి వస్తున్నది తామేనని కాషాయ పార్టీ ప్రకటించుకున్నది. ఆ రెండు పార్టీలను బొందపెట్టే రోజులు ఎంతో దూరంలో లేవని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారం తమదేనని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. మూడు పార్టీల అంచనాలు ఎలా ఉన్నా అధికార పార్టీగా టీఆర్ఎస్ లెక్కలు మాత్రం రోజురోజుకూ మారుతున్నాయి. ఏడు నెలల వ్యవధిలో వచ్చిన తేడాకు కారణాలేంటి? అది ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నదనే చర్చ రాష్ట్రంలో మొదలైంది.

ఫిబ్రవరి 1న సీఎం..

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. "తెలంగాణలో 95-105 సీట్ల మధ్య గెలవబోతున్నాం. రాసి పెట్టుకోండి. ఇది నేను చెప్తున్న మాట. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం. ముందస్తుకు వెళ్ళబోం" అని సూటిగానే చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో మార్చి 21న మీడియా సమావేశంలో కూడా దీన్నే నొక్కిచెప్పారు. 30 అసెంబ్లీ స్థానాల్లో మూడు వేర్వేరు ప్రైవేటు సంస్థలతో సర్వే చేయిస్తే 29 చోట్ల గెలుస్తున్నామని, ఒక్క చోట మాత్రం 0.3% తేడాతో ఓడిపోతున్నామని వెల్లడించారు.

జూలై 15న మంత్రి కేటీఆర్..

ఆ తర్వాత జూలై 15న మీడియా ప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్‌చాట్ చేస్తూ, 90 కంటే ఎక్కువ సీట్లలో గెలవబోతున్నామన్న ధీమాను వ్యక్తం చేశారు. అప్పటికే రెండు ప్రైవేటు సంస్థల సర్వేల్లో వచ్చిన వివరాలను ఉటంకిస్తూ, ఒకటి బీజేపీ చేయించగా, మరోటి కాంగ్రెస్ చేయించిందని కామెంట్ చేశారు. ఈ రెండు సర్వే రిజల్టుల్లో తొలి స్థానంలో టీఆర్ఎస్ పార్టీయే ఉన్నదని, ఎక్కువ సీట్లు వస్తాయని తేలిందని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లో 90కంటే ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై, టీఆర్ఎస్ బలంపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కామెంట్లు ఇలా ఉండగా తాజాగా శాసనసభాపక్ష సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

ఎల్పీ మీటింగ్ లో ఏమన్నారంటే..!

మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ శనివారం రాత్రి మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో 72-80 సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలే మీడియాకు వివరించారు. సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇస్తామని, పద్ధతి మార్చుకోనివారికి ఇవ్వబోమని కూడా సంకేతాలిచ్చారు. ఏడు నెలల క్రితం ఫిబ్రవరి 1న మాగ్జిమమ్‌గా 105 సీట్లు వస్తాయని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినా ఇప్పుడు సెప్టెంబరు 3న మాత్రం అది 80 సీట్లకు తగ్గిపోవడం ఆ పార్టీ నేతల మధ్యనే చర్చకు దారితీసింది. పార్టీ బలహీనపడుతున్నదనే గుసగుసలు మొదలయ్యాయి. నిత్యం సర్వేలపై ఆధారపడే కేసీఆర్ తాజాగా 80 సీట్లకే కమిట్ కావడం ఆ పార్టీ ప్రజాప్రతినిధుల్లో గుబులుకు దారితీసింది. ఏడు నెలల వ్యవధిలో టీఆర్ఎస్ కోల్పోతున్న 25 సీట్లు ఏ పార్టీ ఖాతాల్లోకి పోతున్నాయన్నది కీలకంగా మారింది. వంద జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితి తెలంగాణలో లేదని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. బీజేపీకి రాష్ట్రంలో అంత సీన్ లేదన్న కామెంట్లు కూడా ఆ పార్టీ నుంచే వెలువడ్డాయి. మునుగోడులో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఎల్పీ సమావేశంలో స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇంతకంటే లేవదని, బీజేపీకి అంత సీన్ లేదని కామెంట్ చేస్తూనే టీఆర్ఎస్‌కు తగ్గుతున్న 25 సీట్లు ఎటు పోతున్నాయన్నది మింగుడుపడని అంశంగా మిగిలిపోయింది. లెక్క తప్పిన పాతిక సీట్లు ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తున్నా టీఆర్ఎస్‌ కోల్పోతున్నదనేది పార్టీ అధినేత మాటల ద్వారానే వ్యక్తమైందనే గుసగుసలు మొదలయ్యాయి.

ఆ కొద్ది మంది ఎవరు..?

వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అధ్యయనం తర్వాత సుమారు 40 మంది సిట్టింగ్‌లకు ఈసారి టికెట్లు దక్కకపోవచ్చనే చర్చ టీఆర్ఎస్‌లో మొదలైంది. అది చాలా మంది ఎమ్మెల్యేలలో గుబులును రేకెత్తించింది. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా సిట్టింగ్‌లందరికీ టికెట్‌లు ఇస్తామని, పార్టీ విధానం అదేనని, కానీ 'కొద్దిమంది' వారి పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో ఆ 'కొద్దిమంది'లో ఎవరెవరు ఉన్నారనే టెన్షన్ మొదలైంది. ఒకవైపు టికెట్లు వస్తాయో రావోననే ఆందోళన, మరోవైపు గెలిచే సీట్ల సంఖ్యలో సుమారు పాతిక తగ్గిపోవడం ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నిద్ర పట్టనివ్వడంలేదు. ఏడు నెలల్లో పాతిక సీట్లు తగ్గిపోతే షెడ్యూలు ప్రకారం మరో ఏడాది తర్వాత జరిగే ఎన్నికల నాటికి ఇంకెలాంటి నిరుత్సాహ వార్తలను వినాల్సి వస్తుందోననే అనుమానం వారిని వెంటాడుతున్నది.

ఇవి కూడా చ‌ద‌వండి

అన్నదాత మృత్యు ఘోష.. ఏడేండ్లలో 5 వేల మంది ఆత్మహత్య

Advertisement

Next Story