మునుగోడు బైపోల్ ఎఫెక్ట్: నలిగిపోతున్న సీఈవో ఆఫీస్ స్టాఫ్!

by GSrikanth |   ( Updated:2022-10-23 04:57:00.0  )
మునుగోడు బైపోల్ ఎఫెక్ట్: నలిగిపోతున్న సీఈవో ఆఫీస్ స్టాఫ్!
X

సీఈవో (రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి), స్టాఫ్‌కు లోలోపల భయం పట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డురోలర్ గుర్తు తొలగింపు, బ్యాలెట్ పేపర్‌లో తప్పుడు గుర్తు ముద్రణ కారణంగా ఇద్దరిపై వేటు పడింది. వారి బాధ్యతారాహిత్యంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్లు ప్రభావం చూపాయా? అనే కోణంలో ఎలక్షన్ కమిషన్ ఆరా తీస్తున్నది. ఓ వైపు ఈసీ చివాట్లు, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్లతో సీఈవో స్టాఫ్ సతమతమవుతున్నారని టాక్.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మొదలు ఆ కార్యాలయంలో పనిచేసే స్టాఫ్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలంటూ కేంద్ర ఎలక్షన్ కమిషన్ బాధ్యత అప్పజెప్పింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నుంచీ కంటికి కనిపించని, ఆధారాలకు దొరకని ఒత్తిడి ఎదురవుతున్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదనలేక, అటు కేంద్ర ఎలక్షన్ కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పనిచేయలేక సీఈవో స్టాఫ్ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, అందులో పనిచేసే ఉద్యోగులు కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే జవాబుదారీ. కానీ ఆ ఉద్యోగులంతా స్టేట్ గవర్నమెంట్‌కు చెందినవారు కావడంతో ఎంతో కొంత ప్రభావం ఉండక తప్పదు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా నియమితులవుతున్న వారు రాష్ట్ర ప్రభుత్వంలో దీర్ఘకాలం పాటు వివిధ హోదాల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులే. రాష్ట్ర ప్రభుత్వం సీఈఓ కార్యాలయంలో నేరుగా జోక్యం చేసుకునే అవకాశం, అవసరం లేకపోయినా ఎన్నికల సమయంలో ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అందుకే ఓటర్ల జాబితా రూపకల్పన, కొత్త ఓటర్ల నమోదు, బోగస్ ఓటర్ల తొలగింపు, బ్యాలట్ పేపర్ ప్రింటింగ్, ఈవీఎంల చెకింగ్, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు తదితర పలు దశల్లో విపక్ష పార్టీల నుంచి విమర్శలను ఎదుర్కొంటుంటారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అపవాదును మోస్తూ ఉంటారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగానూ రాష్ట్ర సీఈఓ వికాస్‌రాజ్‌పై అలాంటి ఆరోపణలే వచ్చాయి.

ప్రతి క్షణం టెన్షన్‌తోనే పని..

సీఈవో నుంచి కింది స్థాయి అధికారి వరకు సిబ్బంది ప్రతి క్షణం టెన్షన్‌తో పనిచేస్తున్నారు. ఓవైపు ప్రగతి భవన్ నుంచి ఫోన్ ఎప్పుడు వస్తుందోనని భయం.. మరోవైపు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి ఏం అక్షింతలు పడతాయోననే ఆందోళన వారిలో నెలకొంది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న రోడ్డురోలర్ గుర్తును తొలగించడం, బ్యాలెట్ పేపరులో మరో గుర్తును తప్పుగా ముద్రించడం తదితర అంశాలపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. స్టేట్ గవర్నమెంట్ ఒత్తిళ్లకు లోనవుతుందా? అనే కోణంలో ఆరా తీస్తూ ఉన్నది.

తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

రోడ్డురోలర్ గుర్తు వివాదంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌పై కేంద్ర ఎలక్షన్ కమిషన్ (ఈసీ) బదిలీ వేటు వేసింది. బ్యాలెట్ పేపర్‌లో గుర్తులను తప్పుగా ముద్రించినందుకు ఎమ్మార్వోపై యాక్షన్ తీసుకున్నది. వారిద్దరినీ ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఈ రెండు విషయాల్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విధి నిర్వహణపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిగిన తప్పులకు ఆయన నుంచి వివరణ కోరింది. రోడ్డురోలర్ గుర్తును ఒక అభ్యర్థికి కేటాయించిన తర్వాత ఎలా తొలగిస్తారంటూ ఈసీలోని డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ మూడు రోజుల క్రితం సీఈఓను నిలదీశారు. గుర్తుల్ని మార్చే అధికారం ఈసీకి మాత్రమే ఉన్నదని, ఆర్వోకు ఆ అధికారమెక్కడిదని ప్రశ్నించారు. సీఈఓగా ఎన్నికల నిర్వహణకు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రోడ్డురోలర్ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలంటూ ఈసీతో పాటు సీఈఓకు టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ కామన్ సింబల్‌గా ఉన్న కారు గుర్తుకు పోలి ఉన్నందున ఓటర్లలో కన్‌ప్యూజన్ తలెత్తుతుందని, గతంలో జరిగిన పలు ఎన్నికల్లో రోడ్డురోలర్ గుర్తుకు వేల సంఖ్యలో ఓట్లు పడ్డాయని ఉదాహరణలతో వివరించింది. మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డురోలర్ గుర్తును తొలగించాలని కోరింది. కానీ ఈసీ ఇందుకు నిరాకరించింది. కోర్టులో సైతం టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బే తగిలింది. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న సమయంలో ఒక అభ్యర్థికి రోడ్డురోలర్ గుర్తును కేటాయించి అతని నుంచి సంతకం కూడా తీసుకున్న తర్వాత ఆ గుర్తుకు బదులుగా బేబీ వాకర్ గుర్తు ప్రత్యక్షం కావడం వివాదాస్పదమైంది. ఈసీకి కంప్లైంట్ వెళ్లడంతో స్వయంగా డిప్యూటీ కమిషనర్ నితిష్ వ్యాస్ హైదరాబాద్‌కు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా తప్పులు జరగడాన్ని ఈసీ తప్పుపట్టి రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి ఉన్నదేమోననే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇంకోవైపు టీఆర్ఎస్ విజ్ఞప్తులను సకాలంలో ఢిల్లీలోని ఈసీకి పంపడంలో జాప్యం జరిగిందని, సీఈవో మొదలు స్టాఫ్ వరకు ఫెయిల్ అయ్యారనే అసంతృప్తిని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించలేక, అటు ఈసీని సంతృప్తిపర్చలేక అడకత్తెర తరహాలో నలిగిపోతున్నామని స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీడియాకు దూరంగా వికాస్ రాజ్

ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏ ఎన్నికలు జరిగినా ఎన్నికల ప్రధాన అధికారి ఎప్పటికప్పుడు మీడియాకు వివరాలను అందించేవారు. సందర్భానుసారం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఆఫీసులోని ఇతర సీనియర్ అధికారులదీ ఇదే తీరు. వివిధ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి వైఖరి అవలంబించామో, నిబంధనలు ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నామో మీడియాకు బ్రీఫ్ చేసేవారు. కానీ ప్రస్తుత సీఈవోగా ఉన్న వికాస్‌రాజ్ మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారు. ప్రగతిభవన్ సూచనల మేరకే ఆయన మీడియాకు దూరంగా ఉంటున్నారేమోననే అనుమానాలు సైతం ఐఏఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పోటాపోటీగా మునుగోడుపై కన్నేసినందున అది పరోక్షంగా ఈసీ, స్టేట్ గవర్నమెంట్ రూపంలో సీఈఓ సహా స్టాఫ్‌పై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నది. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాలను వెల్లడించేవరకు ఎన్ని ఇబ్బందుల పడాల్సి వస్తుందోననే వారు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి: కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. 5 పోస్టులకు 30 మంది పోటీ?

Advertisement

Next Story

Most Viewed