కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

by Satheesh |   ( Updated:2023-11-14 16:38:57.0  )
కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు జరిగాయి. వాస్తవానికి ఆయన ఈనెల 17వ తేదీన రావాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్ మారడంతో 18వ తేదీన రానున్నారు. ఆయా సెగ్మెంట్లలో నిర్వహించే ప్రచార సభలతో పాటు రోడ్డు షోలో అమిత్ షా పాల్గొననున్నారు. 18న‌ ఉదయం 10 గంటలకు గద్వాలలో నిర్వహించే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు నల్లగొండ సభల్లో, అనంతరం 2 గంటలకు వరంగల్ తూర్పు ప్రచార సభలో ఆయన పాల్గొంటారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్డు షోలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు. షా షెడ్యూల్ మారడంతో మేనిఫెస్టో విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. ఇదిలా ఉండగా ఈనెల 17వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే షా రాకను 18కి మార్చుకోవడంతో 17 రిలీజ్ చేస్తారా? లేక 18వ తేదీన విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

గద్వాల నియోజకవర్గంలో బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాడులపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, లీగల్ సెల్ నాయకుడు ఆంటోనీ రెడ్డి, రామారావు తదితరులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలు తీసుకోకుంటే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి, సుప్రీంకోర్టుకు సైతం వెళ్తామని బీజేపీ నాయకులు వెల్లడించారు. అలాగే నిర్మల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed