‘పేదవాడు కోటీశ్వరుడు కావాలన్నదే చంద్రబాబు ఆశయం’

by GSrikanth |
‘పేదవాడు కోటీశ్వరుడు కావాలన్నదే చంద్రబాబు ఆశయం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేద‌వాడు కోటీశ్వరుడు కావాలన్నదే చంద్రబాబు ఆశ‌య‌మ‌ని, ఈ ల‌క్ష్యం దిశ‌గా ప్రత్యేక విజ‌న్‌తో ముందుకు వెళుతున్నార‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎన్టీఆర్ భవన్లో గురువారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కాసాని ప్రారంభించి మాట్లాడారు. తెలుగు ప్రజ‌ల సంక్షేమం కోస‌మే బాబు నిరంత‌రం కృషి చేస్తున్నార‌న్నారు. నిబ‌ద్ధత క‌లిగిన ప్రజా నాయ‌కుడన్నారు. కొత్త విధానాల‌ను, వ్యవ‌స్థల‌ను ఏ విధంగా అందించాల‌ని నిరంత‌రం ఆలోచిస్తూ అదే ల‌క్ష్యసాధ‌న దిశ‌గా ప‌నిచేస్తున్నారన్నారు. గతంలో విజన్ 2020 ని ప్రవేశపెట్టి దానిని అమలు చేసి చూపారని, బాబు విజ‌న్ ఫ‌లితంగానే నేడు వేల కోట్ల విలువైన ఐటీ ఫ‌లాలు చేతికందుతున్నాయ‌ని, త‌ద్వారా రాష్ట్ర సంప‌ద పెరుగుతుందన్నారు.

పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మహనీయుల స్ఫూర్తితో చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనే చంద్రబాబు ఆలోచనపై ఒక విధాన పత్రాన్ని విడుదల చేయబోతున్నారన్నారు. చంద్రబాబు ఆలోచనలను ముందుకు తీసుకుపోదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే విధంగా తెలుగుయువత తరపున ‘సెల్ఫీ విత్ హాష్ ట్యాగ్ సీబీఎన్ డెవలప్డ్ తెలంగాణ’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా క‌మిటీ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మీడియా కో - ఆర్డినేటర్ బియ్యని సురేష్, జాతీయ అధికారప్రతినిధి జ్యోత్స్న, కందికంటి అశోక్ కుమార్ గౌడ్, పొగాకు జయరామ్ చందర్, సామభూపాల్ రెడ్డి, షకీలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed