'పిచ్చికుక్కలా మొరిగితే ప్రజలు నమ్మరు' హరీశ్ రావుపై చామల ఘాటు వ్యాఖ్యలు

by Prasad Jukanti |
పిచ్చికుక్కలా మొరిగితే ప్రజలు నమ్మరు హరీశ్ రావుపై చామల ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూర్: బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటే వాటిలో తప్పులు, పెడర్థాలు తీసి ప్రజల్లో హరీశ్ రావు విషబీజాలు నాటే ప్రయయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియోను రిలీజ్ చేసిన చామల.. హరీశ్ రావు లాంటి వాక్చాతుర్యం మాకు లేదని ఇచ్చిన ప్రతి హామీని నెరేవర్చాలని ఉద్దేశంతో ముందుగు వెళ్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీరో కాబోతున్నదని అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జీరోగా మారబోతున్నదన్నారు. ఈ పరిణామాలు తట్టుకోలేక హరీశ్ రావు ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అలయెన్స్ లో ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా అయిన హరీశ్ రావు.. 2004 నుంచి కంటిన్యూగా అధికారాన్ని ఎంజాయ్ చేశారని ఇప్పుడు అధికారం లేకపోయేసరికి ఉండలేకపోతున్నారని ధ్వజమెత్తారు. పవర్ లేక 150 రోజులుగా హరీశ్ రావుకు నిద్రపట్టడం లేదని దాంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు.

మొరిగే కుక్కలు కరువవని.. అలాగే ప్రభుత్వంపై మీరు ఇలాగే మొరిగితే ప్రజలు నమ్మరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంత కాలం ఓపిక పట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా మీకు నిద్రనే పట్టడం లేదని విమర్శించారు. జూన్ 4 న ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజాసంక్షేమంపై దృష్టి సారించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. అప్పుడు ప్రతిపక్షాలు తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలన్నారు. ప్రభుత్వం మంచి చేస్తే అభినందించి పొరపాట్లు ఉంటే ఎండగట్టాలని సూచించారు. గడిచిన పదేళ్లు తెలంగాణ ఆగమైందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారని.. మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాలతో మంచి ఏదో చెడు ఏదో ప్రజలు తెలుసుకునే పరిస్థితి లేకుండా పోతోందని అన్నారు. మాపై కాస్త సమయం ఇచ్చి నమ్మకం ఉంచాలని ప్రజలను కోరారు.

ఏదో మాట్లాడి ఫేమస్ అవడం గొప్ప కాదు:

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చామల ధ్వజమెత్తారు. ఆ పార్టీలో రాజాసింగ్ లాంటి అనేక మంది సీనియర్లు ఉన్నా ఢిల్లీలో ఏం లాబీయింగ్ చేసుకుని బీజేఎల్పీ హోదా తెచ్చుకున్నాడో ఏమో అన్నారు. వంద, రెండు వందల కోట్లు ట్రాన్స్ ఫర్ చేసి పోస్టులు తెచ్చుకోవడంలో మహేశ్వర్ రెడ్డి అనుభవం కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడని ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డి పీఆర్పీ నుంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లారని, ఆ పార్టీలో తన గుర్తింపు కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. పౌరసరఫరాల శాఖలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మీకు ఏదైనా పని ఉంటే చెప్పండి అంతే తప్ప ఉత్తమ్ కుమార్ లాంటి వ్యక్తిపై ఆరోపణలు చేస్తూ ప్రజలను కన్ఫ్యూజన్ చేయవద్దన్నారు. మీడియా కనిపించగానే రోజుకో ట్యాక్స్ పేరుతో ఏదో మాట్లాడి ఫేమస్ కావడం గొప్ప కాదని.. మీరు మాట్లాడిన ప్రతి మాటను నిరూపించాల్సిన బాధ్యత మీ పై ఉందన్నారు. పదవిలో కూర్చున్న వెంటనే ఏదో సాధించాలని గతంలో కూడా పీఆర్పీ, కాంగ్రెస్ లోనూ ప్రయత్నించి మీరు విఫలం అయ్యారని గుర్తు చేశారు. ఇకనైనా బీజేఎల్పీ పోస్టును జాగ్రత్తగా కాపాడుకోవాలని హితవు పలికారు.

Advertisement

Next Story