Chamala Kiran: కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండండి.. కాంగ్రెస్ ఎంపీ కీలక సూచనలు

by Ramesh Goud |
Chamala Kiran: కార్యకర్తలు, నాయకులు  సిద్ధంగా ఉండండి.. కాంగ్రెస్ ఎంపీ కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్దంగా ఉండాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదురుకునేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు.

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులంతా అలెర్ట్ అయ్యి, అక్కడ జరుగుతున్న పరిస్థితులపై అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఎక్కడైనా వరదల వల్ల రోడ్లు కొట్టుకొని పోయినా, చెరువులకు గండ్లు పడే అవకాశం ఉన్నా గమణించి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను అలెర్ట్ చేయాలని కోరారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా ఉండి, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎక్కడైనా విపత్కర పరిస్థితులు ఎదురుపడే అవకాశం ఉండి, పై అధికారులకు తెలియజేయాల్సి ఉంటే వెంటనే తనని సంప్రదించాలని సూచించారు. అంతేగాక భారీ వర్షాలకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండొచ్చని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచనలు చేశారు.

Advertisement

Next Story