డెంగ్యూతో బాలుడు మృతి.. డాక్టర్ నిర్లక్ష్యమే కారణమా..?

by Mahesh |
డెంగ్యూతో బాలుడు మృతి.. డాక్టర్ నిర్లక్ష్యమే కారణమా..?
X

దిశ, ఉప్పునుంతల: అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ బాలుడు మృతి చెందాడు. ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన రెడ్డమోని మల్లేష్ హైమావతి దంపతులకు చెందిన శశి వర్ధన్ యాదవ్(5)కు గత వారం రోజుల క్రితం వైరల్ ఫీవర్ సోకిందని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారం రోజుల ట్రీట్మెంట్ అనంతరం డెంగ్యూ వ్యాపించిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని అచ్చంపేట పట్టణంలోని కిడ్స్ కేర్ డాక్టర్ సూచించారు. హుటాహుటిన వాళ్ళు హైదరాబాద్ తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించిందని డాక్టర్లు సూచించారు. దీంతో గురువారం రాత్రి బాలుడు చనిపోయినట్లు డాక్టర్ నిర్ధారించారు. బాలల మృతికి కిడ్స్ కేర్ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాబు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయలేకపోయిన డాక్టర్.. తమకు కడుపు కోత మిగిలించాడని కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు రోధిస్తున్నారు.

ఆ కాలనీలో అంతా అపరిశుభ్ర వాతావరణం..

మర్రిపల్లి గ్రామంలోని వెంకటేశ్వర కాలనీ ఎన్టీ రామారావు హయాంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం చేపట్టి కాలనీ ఏర్పడిన అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా అధికారులు మారినా.. ఆ కాలనీ వైపు ఏ సర్పంచ్ గాని ఏ అధికారి గానీ కనికరించి ఓ సిసి రోడ్డు వేయలేదు. ఓ మురికి కాలువ తీయలేదు అక్కడున్న అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగించలేదు. దీంతో ప్రజలు రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారని కాలనీవాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. అందరూ కపట ప్రేమ చూపే వాళ్ళు తప్ప మనస్ఫూర్తిగా తమ గ్రామానికి తమ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం లేని.. ఎంపిటిసిలు, సర్పంచులు ప్రజల సొమ్ముతో జీతాలు పొందుతున్న అధికారులు కూడా తీసుకున్న జీతానికి కూడా న్యాయం చేయలేని స్థితిలో అధికారుల పాలన సాగుతోందని విమర్శించారు.

వీరందరి నిర్లక్ష్యానికి ఆ గ్రామ కాలనీ ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు వాపోయారు. ప్రజలు విసుగు చెంది పేపర్ లో వార్తలు రాయించినప్పుడు మాత్రమే అధికారులు కానీ, పాలకులు గాని అటువైపు చుట్టం చూపుగా వచ్చి వంతుకు గంతేసి పోతున్నారే తప్ప పాలనకు విలువ ఇవ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజారోగ్యం పైన దృష్టి సారించాల్సిన డాక్టర్లు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం రోగాలకు మరో నిదర్శనం. ప్రభుత్వం వారానికి ఒకసారి ప్రతి గ్రామాన్ని స్వచ్ఛతగా ఉంచేందుకు ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే.. ఆరోగ్య సిబ్బంది అటువైపు రాకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ చూపి తమ గ్రామంలోని వెంకటేశ్వర కాలనీ సందర్శించి..తమకు విముక్తి కల్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు.


Advertisement

Next Story