బడ్జెట్ సమావేశానికి చైర్మన్ డుమ్మా

by Sathputhe Rajesh |
బడ్జెట్ సమావేశానికి చైర్మన్ డుమ్మా
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి చైర్మన్ సూతకాని జైపాల్ గైర్హాజరయ్యారు. ఈ బడ్జెట్ సమావేశం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించాల్సి ఉంది. అయితే చైర్మన్ గైర్హాజరు కావడంతో వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు అధ్యక్షతన సమావేశాన్ని ప్రారంభించారు. ఈ బడ్జెట్ సమావేశానికి వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

వైరా మున్సిపాలిటీలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చైర్మన్ బడ్జెట్ సమావేశానికి హాజరు కాకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 15వ తేదీన వైరా మున్సిపాలిటీ ఇన్ ఛార్జి కమిషనర్ బి. అనిత సోమవారం గ్రామంలో మంచినీటి ట్యాంకును గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విధితమే. ఇన్ ఛార్జి కమిషనర్ ఫిర్యాదుతో పోలీసులు ముమ్మర విచారణ చేపట్టారు.

మంచినీటి ట్యాంక్ కూల్చివేత వ్యవహారంలో అనుమానితులందరిని పోలీసులు విచారించారు. పోలీసుల విచారణ ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం. అయితే గత రెండు రోజులుగా చైర్మన్ జైపాల్ సెల్ ఫోన్ పనిచేయడం లేదంటూ వైరాలో ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశానికి చైర్మన్ గైర్హాజరు కావడం విశేషం. చైర్మన్ ఉద్దేశపూర్వకంగా ఈ సమావేశానికి గైర్హాజరయ్యారా..? వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి రాలేకపోయారా? అనే విషయం బహిర్గతం కావాల్సి ఉంది. వైరా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత చైర్మన్ అధ్యక్షత వహించకుండా నిర్వహించిన తొలి బడ్జెట్ సమావేశంగా తాజా సమావేశం చరిత్రలో నిలిచిపోనుంది.

Advertisement

Next Story

Most Viewed