గొలుసు కట్టు ఆక్రమణ.. ప్రశ్నార్థకంగా ఆయకట్టు సాగు

by Sathputhe Rajesh |
గొలుసు కట్టు ఆక్రమణ.. ప్రశ్నార్థకంగా ఆయకట్టు సాగు
X

దిశ, లక్షెట్టిపేట : గొలుసు కట్టు చెరువులకు ఉన్న వరద కాల్వలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. ఓ వైపు మరమ్మతులకు నోచుకోక, మరోవైపు ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఒక చెరువు నుంచి మరో చెరువుకు లక్షెట్టిపేట మండలంలోని ఏడు చెరువులకు ఉన్న గొలుసుకట్టు బంధం తెగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. దృష్టి సారించి కాల్వలను కాపాడాల్సిన సంబంధిత నీటి శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఆ చెరువుల కింద ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం కానుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏడు చెరువుల గొలుసు కట్టు..

ఎప్పుడో నైజం కాలంలో లక్షెట్టిపేట మండలంలోని చెల్లంపేట అటవీ శివారులో ఉన్న దొనబండ వాగుపై మత్తడిని నిర్మించారు. ఆ వాగులో వచ్చే వరద నీటిని మత్తడి ద్వారా మళ్లించి మండలంలోని ఏడు గొలుసు కట్టు చెరువుల్లో నీటిని నింపేందుకు ప్రణాళిక బద్ధమైన రూపకల్పన చేశారు. ఒక చెరువు మత్తడి నుంచి మరొక చెరువుకు వరద నీరు వెళ్లేలా వరద కాల్వ లు నిర్మించారు. ఈ చెరువుల కింద ప్రతి యేటా వానాకాలం సుమారు 5వేల ఎకరాలు, యాసంగిలో సుమారు 3 వేల ఎకరాలు ఆయకట్టు సాగువుతోంది.

దొనకొండ వాగు మత్తడి నుంచి వరద నీరు దౌడేపల్లి గ్రామ రావికుంట, పెద్ద చెరువు, చెల్లంపేట శివారులోని చింతలకుంట, చెందారం గ్రామ హన్మంతపల్లి చెరువు, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని గంపలపల్లి, ఇటిక్యాల, బొట్లకుంట చెరువులకు ఒక చెరువు నుంచి మరొక చెరువుకు ఈ వరద కాల్వలు ఉన్నాయి. ఈ కాల్వలకు ఉపాధి హామీ పథకం కింద పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తీయిస్తున్నారే తప్ప.. కాల్వ కట్టలకు అవసరమైన మరమ్మత్తు‌లు చేయించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

కాల్వలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చెల్లంపేట, హన్మంతపల్లి చెరువుల కింది కొందరు భూస్వాములు వరద కాల్వ గట్లను ధ్వంసం చేసి ఆక్రమించి తమ పొలాల్లో కలిపేసుకుంటున్నారు. కాల్వ గట్ల ధ్వంసంతో ప్రతి యేటా వర్షాకాలంలో ఆ ప్రాంతంలో వరద నీటికి కాల్వలకు గండ్లు పడి సాగునీరు వృధా అయి పంట పొలాలకు నష్టం వాటిల్లుతోంది.

ఆక్రమించి అమ్మకాలు చేస్తూ..

లక్షెట్టిపేట పురపాలక సంఘం పరిధిలోని గంపలపల్లి, ఇటిక్యాల, బొట్లకుంట వరద కాల్వలు ఆక్రమణ ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఈ కాల్వలు మెల్లమెల్లగా ఆక్రమణలకు గురవుతుండడంతో వరద నీరు ఒక చెరువు నుంచి మరొక చెరువు వెళ్లే దారి లేక ఆయకట్టు విస్తీర్ణం తగ్గిపోతోంది. గంపల పల్లి చెరువు నుంచి బొట్లకుంట చెరువుకు వెళ్లే వరద కాల్వను ఊత్కూర్ వద్ద పూడ్చివేస్తూ రియల్టర్లు, ఆక్రమణదారులు అమ్మకాలు చేస్తూ అక్రమార్జన చేస్తున్నారు.

దీంతో బొట్లకుంట చెరువు కింద సాగునీరు అందే పరిస్థితి లేక ఆయకట్టు సాగు కావడం లేదు. అలాగే గంపలపల్లి వరద కాల్వ నుంచి ఇటిక్యాల వరద కాల్వను అనుకుని వెంచర్లు వేస్తున్న రియల్టర్లు కొద్ది కొద్దిగా ఆక్రమిస్తుండడంతో కాల్వ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా పాలకులు, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు గొలుసుకట్టు చెరువుల వరద కాల్వలపై దృష్టి సారించి ఆక్రమణలను తొలగించాలని, మరమ్మత్తులు చేయించి చెరువుల్లోకి కాల్వల ద్వారా వరద నీరు చేరేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed